రాములమ్మ ఎక్కడ..!

Where is Ramulamma..!– మూగపోయిన విజయశాంతి ట్విట్టర్‌ .. మెదక్‌ సీటు ఇవ్వనందుకు అలిగారా?
– ఇమడలేక ఇంటికే పరిమితమయ్యారా?
– పార్టీలో చేర్చుకుని పదవి ఇవ్వకుండా అవమానిస్తున్నారా?
– అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకే ఒక్కసారి గాంధీభవన్‌కు…
– పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి వచ్చేనా?
– పని చేయని సీనియర్ల రాయబారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సినీనటి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విజయశాంతి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల హీట్‌ పెరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ జాడ ఎక్కడా లేకపోవడంతో రాములమ్మ ఏమైంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రత్యర్థుల విమర్శలకు పదునైన మాటలతో ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా ధీటైన కౌంటర్లు ఇచ్చే రాములమ్మ ఎందుకిలా మారిపోయారనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి విజయశాంతి ట్విట్టర్‌ పిట్ట కూడా మూగపోయింది. ఈ క్రమంలో విజయశాంతి ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
నిరాశ పరిచిన మెదక్‌ సీటు
గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే మెదక్‌ ఎంపీ సీటును విజయశాంతి ఆశించారు. ఈ విషయంలో పార్టీ హామీ ఇవ్వకపోయినా ఆమె మాత్రం ఆసీటుపై బలంగానే పట్టుపట్టారు. కానీ మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా సీటును నీలం మధుకు కేటాయించింది. ఈ విషయంలో పార్టీ కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ కారణంగానే మనస్థాపానికి గురై ఆమె రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములమ్మ…ఆ తర్వాత ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగసభకు ఆమెను కూడా ఆహ్వానించలేదని తెలిసింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రచారం మొదలైంది. అందులోనూ ఆమె ఎక్కడా కానరావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కసారి గాంధీభవన్‌కు వచ్చిన ఆమె ఆ తర్వాత ఇంటికే పరిమతమయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. అయితే ఆ సమయంలో విజయశాంతి బీఆర్‌ఎస్‌పై పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజానికి అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందడం పట్ల విజయశాంతి సంతోషంగా ఉన్నారు.
బీజేపీలో ఇమడలేకనే…
గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని వీడిన రాములమ్మ కమలం గూటికి చేరారు.అయితే బీజేపీలో కూడా ఆమెకు సరైన గౌరవం ఇవ్వలేదు. ముఖ్యంగా ఆ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేధాలు తారాస్థాయికి చేరాయి. అయినా ఆమె ఎక్కడ వెనుకడుగు వేయకుండా అనేక ప్రజా సమస్యలపై స్పందించారు. కమలం పార్టీలో ఉంటే ఏదో గ్రూపులో చేరిపోవడం తప్ప మరో గత్యంతరం లేదు. దీంతో పార్టీలో ఇమడలేక ఆమె మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. కానీ అక్కడ కూడా ఇమడలేక, బయటకు రాలేక ఇంటికి పరిమితవుతున్నారనే వార్తలొస్తున్నాయి. ఎంతో ఉత్సహంగా పార్టీలో చేర్చుకోవడం, ఆ తర్వాత సముచిత స్థానం కల్పించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలిసింది. సీనినటిగా విజయశాంతికి పాపులార్టీ ఉన్నది. రాజకీయ ఫైర్‌ బ్రాండ్‌గా కూడా ఆమెకు పేరుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ….పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆమె సేవలు ఉపయోగించుకునేలా ప్లాన్‌ చేయాలని ఆ పార్టీ వర్గాలు అధిష్టానాన్ని కోరుతున్నాయి. కొంత మంది సీనియర్‌ నేతలు ఆమెతో రాయబారం కూడా నడిపినట్టు సమాచారం. అయినప్పటికీ విజయశాంతి శాంతించలేదని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప ఆమె గాంధీభవన్‌ గడప తొక్కేలా లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Spread the love