రుణమాఫీపై కసరత్తు

Exercise on loan waiver– వారంలో క్యాబినెట్‌.. ఆ తర్వాతే మార్గదర్శకాలు..
– పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై రాష్ట్ర సర్కార్‌ అధ్యయనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు రూపొందించేందుకు వీలుగా వారం రోజుల్లో క్యాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు ఆగస్ట్‌ 15 లోగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు సర్కార్‌ పట్టుదలగా ఉంది. తదనుగుణంగా నిధుల సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించిన సంగతి విదితమే. రుణమాఫీ అమలు కోసం నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.. ఈ క్రమంలో అధికారులు తదుపరి చర్యలు మొదలు పెట్టారు.
ఎన్ని అవాంతరాలెదురైనా రైతులకిచ్చిన రుణమాఫీ హామీని తూ:చా తప్పకుండా అమలు చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆందులో భాగంగా ఇప్పటికే అధికారులు బ్యాంకులతో ఓ దఫా చర్చలు జరిపారు. ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి? ఎంత మంది రైతులు రూ.2లక్షల రుణానికి అర్హులౌతారు?. అర్హులైన రైతులందరికీ లబ్ది చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై వారు కసరత్తు మొదలు పెట్టారు. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్మెన్లు, రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్‌ అందుకునే రిటైర్డ్‌ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్ట్‌ లాంటి ప్రొపెషనల్స్‌ ను ఈ పథకం నుంచి కేంద్రం మినహాయించింది. పీఎం కిసాన్‌ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలతో అసలైన రైతులకు లబ్ధి చేకూరిందనే చర్చ కొనసాగుతోంది.. వాటన్నింటిని పరిగణంలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
ఏక కాలంలో రుణమాఫీ
గతంలో లాగా విడతల వారీగా కాకుండా ఏక కాలంలో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. లక్ష రుణ మాఫీని ఏక కాలంలో చేస్తామని చెప్పి ఏకంగా ఐదేండ్ల పాటు సాగదీసింది. తొలి ఏడాది రూ.25 వేల వరకు, రెండో ఏడాది రూ.50 వేల వరకు, నాలుగో ఏడాది రూ.75 వేల వరకు, ఎన్నికల ముందు రూ.99,999 వరకు నాలుగు విడతలుగా రుణమాఫీని పూర్తి చేసింది. రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ. 25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్దిదారుల సంఖ్యను కుదించింది. దీంతో 36.68 లక్షల మంది రైతులకు రూ.20,141 కోట్లు మాఫీ చేయాలని బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. అయిదేండ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం చివరివరకు 23 లక్షల మంది రైతులకే రుణ మాఫీ చేసింది. రూ. లక్ష కంటె అధికంగా ఉన్న 14 లక్షల మంది రైతులకు ఈ మాఫీ వర్తించలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రైతులు ఐదేండ్ల పాటు అవస్థలు పడ్డారు. సర్కార్‌ మాఫీ చేస్తుందనే భరోసాతో చాలా మంది రైతులు రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోలేదు. ఫలితంగా వడ్డీకి వడ్డీ తోడై రుణ మొత్తాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం విడతల వారీగా చేసిన రుణ మాఫీ వడ్డీలకే సరిపోయింది. దాంతో చాలా మంది రైతులను బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. అటు బ్యాంకుల్లో, ఇటు ప్రయివేటులో అప్పు పుట్టక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన తప్పులకు ఆస్కారం లేకుండా ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో సర్కార్‌ మెందుకెళుతున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Spread the love