ప్రవాసీయులు కేరళ జీవనాడి

ప్రవాసీయులు కేరళ జీవనాడి– కువైట్‌ నుంచి కొచిన్‌ ఎయిర్‌పోర్ట్‌కు భారతీయుల మృతదేహాలు
– కేరళ సీఎం విజయన్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల నివాళి
కోచి : ప్రవాసీయులు కేరళకు జీవనాడి వంటివారని, ఇంతమంది ఈ అగ్నిప్రమాదంలో మరణించడం దేశానికి తీరని నష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. కువైట్‌ అగ్ని ప్రమాదంలో మరణించిన 45మంది భారతీయుల మృతదేహాలు కొచిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం చేరుకున్నాయి. మృతి చెందినవారిలో 23మంది మలయాళీలే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు విమానాశ్రయానికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు ఈ మృతదేహాలను తీసుకుని భారత వాయు సేనకు చెందిన విమానం ఇక్కడ ల్యాండ్‌ అయింది. కోచి విమానాశ్రయం వద్ద పినరయి విజయన్‌ విలేకర్లతో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత కువైట్‌ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని అన్నారు. భారత ప్రభుత్వం కూడా సరైన సమయంలో చక్కగా జోక్యం చేసుకుందని పేర్కొన్నారు. మృతదేహాల శవపేటికలపై పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు.
స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించారు. తర్వాత అదే విమానం మిగిలిన మృతదేహాలను తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ చేరుకుంది. విమానంలో మృతదేహాలతోపాటు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌, తమిళనాడు మైనారిటీ సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమ మంత్రి కెఎస్‌ మస్తాన్‌ వున్నారు. వారు కూడా కొచిన్‌ ఎయిర్‌పోర్టులో నివాళులర్పించారు. 45 మృతదేహాలకు అవసరమైన ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌కు సంబంధించిన ప్రక్రియ అంతా విమానాశ్రయంలోనే జరిగింది. మృతుల కుటుంబీకులు, బంధువులు అందరూ విమానాశ్రయంలో తమవారి కోసం వేచిచూడడం కనిపించింది. తమిళనాడుకు చెందిన వారి మృతదేహాలను రోడ్డు మార్గంలో తరలించారు. విమానాశ్రయం వెలుపల అంబులెన్సులు బారులు తీరి కనిపించాయి. కేరళ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు మృతదేహాలను తీసుకురావడానికి విదేశాంగ శాఖ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిందని కేరళ రెవెన్యూశాఖ మంత్రి కె.రాజన్‌ చెప్పారు. కేరళ అధికార ప్రతినిధిగా వెళ్ళేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జికి కువైట్‌ వెళ్లడానికి కేంద్రం అనుమతి నిరాకరించడంపై కేరళ ప్రతిపక్ష నేత విమర్శించారు.
మరో భారతీయుడు మృతి
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడు శుక్రవారం మరణించాడని కువైట్‌ విదేశాంగ మంత్రి విలేకర్లకు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 46కి పెరిగిందని అధికారులు తెలిపారు. భవనం కింద అంతస్తులో గార్డు రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు.
మాటలకందని విషాదం
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాద విషాదం మాటలకందనిదని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ వ్యాఖ్యానించారు. ప్రవాసీల పట్ల, వారి కఠోర శ్రమ పట్ల కేంద్ర, రాష్ట్రాలకు చాలా గౌరవం వుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్‌ గోపి వ్యాఖ్యానించారు. ఈ విషాదం చాలా బాధాకరమైందని అన్నారు. ఈ ప్రమాద మృతుల్లో ఒడిషాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా వున్నారు. వారి మృతికి ఒడిషా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వీరి మృత దేహాలు శుక్రవారం సాయంత్రానికి ఢిల్లీ నుండి ఒడిషా చేరుకున్నాయి.

Spread the love