ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి

Increase income Explore ways– ప్రభుత్వ శాఖలకు డిప్యూటీ సీఎం
– ఆర్థికశాఖ మంత్రి భట్టి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్‌, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండేండ్ల ఆర్థిక ప్రగతిని పరిశీలించారు. అన్ని శాఖలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్‌ అంచనాలను అందుకోవాలని సూచించారు. అలాగే ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేట్లను సమీక్షించుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయించుకోవాలని ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో ఇలాంటి ప్రయోగం చేయడం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిందంటూ ఆ వివరాలను ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయనీ, ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనా పురోగతి లేకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్రయోజనం పొందే ప్రమాదం ఉందనీ, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హౌసింగ్‌ బోర్డ్‌, రాజీవ్‌ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇండ్లు, వచ్చిన ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇండ్లు, ఇండ్ల స్థలాల పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్సలు అందించేలా వారిని ఒప్పించాలని, ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వివరిస్తూ, వారితో చర్చలు జరపాలని చెప్పారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్‌ బుద్ధ ప్రసాద్‌, ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love