– రూ.2,500 ఆలస్య రుసుంతో చెల్లింపునకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.2,500 ఆలస్య రుసుంతో వచ్చేనెల మూడో తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశముందని తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 4,45,990 మంది, ఒకేషనల్‌లో 54,500 మంది కలిపి 5,00,490 మంది విద్యార్థులుంటే, 4,77,906 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 4,27,712 మంది, ఒకేషనల్ విభాగంలో 49,633 మంది కలిపి మొత్తం 4,77,345 మంది విద్యార్థులకుగాను 4,43,209 మంది విద్యార్థులు ఫీజు కట్టారని పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రయివేటు విద్యార్థులతో కలిపి 10,59,233 మంది విద్యార్థులుంటే, 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని వివరించారు. ఇంకా 82,193 మంది ఫీజు కట్టలేదని తెలిపారు. ఆ విద్యార్థులంతా ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.