అసామాన్య జీవితాలు

Extraordinary livesమానవి శీర్షిక ప్రారంభమైననాటి నుండి స్ఫూర్తిదాయ మహిళల జీవితాల గురించి తెలుసు కుంటూనే ఉన్నాం. నిత్యం బలమైన మహిళల చుట్టూ తిరగుతున్నాం. అసమానతలను అధిగమిస్తున్న వారి దమ్ము, ధైర్యం మనల్ని ఎంతో ప్రభావితం చేస్తూనే ఉంది. 2023 కూడా దీనికి భిన్నంగా లేదు. ఈ ఏడాది కూడా మన హృదయాలను తాకిన అగ్ర కథనాయికలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరి గురించి ఈరోజు మళ్ళీ మరోసారి మననం చేసుకుందాం…
మరో కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నాం అంటే పాత ఏడాది గురించి ఆత్మపరిశీలన చేసుకోవడం. మనం ఈ ఏడాదిలో కోల్పోయిన వాటిని రాబోయే ఏడాదిలో సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. అలాగే ఇది వేడుకల సమయం కూడా. మనం స్ఫూర్తి పొందాలంటే మానవత్వంతో కూడుకున్న కొన్ని జీవితాలు మన మనసుల్ని కదిలించాలి. ఎందుకంటే ఆ స్త్రీ చేస్తున్న పోరాటం, సాధిం చిన విజయం గురించి చదువుతుంటే అది మనదేనా అనే భావన తప్పక వస్తుంది. వారి ఎదుర్కొన సమస్యలు మనకు మన జీవితం పట్ల కొత్త ఆశను ఇస్తుంది.
కుట్టు పనితో…
1990లో సామాజిక కార్యకర్త బాబా ఆమ్టే మార్గ దర్శకత్వంలో నివేదిత బెనర్జీతో పాటు వారి స్నేహితుల బృందం కలిసి మధ్యప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతంలో భారతదేశంలోని అతిపెద్ద అట్టడుగు కార్యక్రమాలలో ఒకటైన సమాజ్‌ ప్రగతి సహయోగ్‌ (ఎస్‌పీఎస్‌)ని ప్రారంభించారు. ఇదంతా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలోని బాగ్లీ తహసీల్‌లోని నీమ్‌ఖేడా అనే చిన్న గ్రామంలో ప్రారంభమైంది. బాగ్లీలో గిరిజన సంఘాలతో కలిసి పనిచేసే క్రమంలో స్థానిక పాలనలో మహిళలు కనిపించక పోవడం బెనర్జీ గమనించారు. కాలక్రమేణా మహిళలు ఈ బృందం సహకాకరంతో తమ గురించి ఆలోచించడం ప్రారంభించారు. ‘వారు మా ఇళ్లకు వస్తారు. బెడ్‌షీట్లు, దిండు కవర్లు, కుషన్‌ కవర్లు, కుర్తాలు కుట్టడం మాకు నేర్పించారు’ అని శుభ చెప్పారు. ఇలా వీరు జిల్లాలో వందలాది మంది మహిళలను సాధికారత వైపు నడిపించారు.
ఆరోగ్య సంరక్షణలో…
2004లో సునామీ అండమాన్‌ తీరాన్ని తాకింది. అప్పటికే శాంతి తెరెసా లక్రా అండమాన్‌లోని మారుమూల ప్రాంతమైన డుగోంగ్‌ క్రీక్‌లోని సబ్‌ సెంటర్‌లో నర్సుగా మూడు ఏండ్లుగా పని చేస్తున్నారు. ఈ ప్రాంతం భారతదేశంలోని పురాతన తెగలలో ఒకటైన ఒంగే నివాసంగా ఉంది. సునామీ సమయంలో ఒంగేల ఆరోగ్య సంరక్షణకు లక్రా తనను తాను అంకితం చేసుకున్నారు. మొదట్లో వారు బయటి వారి మద్దతును అంగీకరించేవారు కాదు. వారి వైద్య చరిత్ర, భాష కూడా ఆమెకు అడ్డంకిగా ఉండేది. అయినప్పటికి నిరంతరం కలుస్తూ వారితో స్నేహం చేసి, తమ కేంద్రంలోని వైద్య సదుపాయాలను పొందేలా వారిని ఒప్పించారు. కరోనా సమయంలో లక్రా తన బృందంతో కలిసి వివిధ గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు. ఎత్తైన అలలను దాటుకుంటూ వెళ్ళిన వారు తిరిగి తమ శిబిరానికి వస్తారో లేదో తెలియదు. 2006 చివరిలో లక్రా పోర్ట్‌ బ్లెయిర్‌లోని జి.బి పంత్‌ ఆసుపత్రికి బదిలీ చేయబడ్డారు. అక్కడ పని చేస్తూనే గిరిజన, మారుమూల ప్రాంతాలలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా సేవలందిస్తుంది. ప్రస్తుతం 52 ఏండ్ల ఆమె జీవించి ఉన్నంత కాలం తన వైద్య సేవలను కొనసాగిస్తానంటుంది.
తమ ప్రత్యేక స్పర్శతో…
పుట్టినప్పటి నుండి అంధులైన నూరున్నిస్సా, అయేషా బాను రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా పరీక్షించడంలో సహాయం చేయడానికి తమ స్పర్శ శక్తిని ఉపయోగిస్తున్నారు. యువతులు డిస్కవరింగ్‌ హ్యాండ్స్‌లో భాగంగా ఎనేబుల్‌ ఇండియా ద్వారా శిక్షణ పొందిన మెడికల్‌ టాక్టైల్‌ ఎగ్జామినర్లు (ఎంటీఈలు) వీరిద్దరు. ఈ కార్యక్రమాన్ని జర్మనీలో డాక్టర్‌ ఫ్రాంక్‌ హాఫ్‌మన్‌ ప్రారంభించారు. అంధులు, దృష్టి లోపం ఉన్న మహిళల ద్వారా ప్రారంభ రొమ్ము క్యాన్సర్‌ కణితులను గుర్తించడానికి ఇది రూపొందించబడింది. ఈ పద్ధతిలో ఎంటీఈలు తమ ప్రత్యేక స్పర్శ నైపుణ్యాలను ఉపయోగించి 0.3 మి.మీ కంటే తక్కువగా ఉండే రొమ్ము క్యాన్సర్‌/ కణితిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తారు. ఎనేబుల్‌ ఇండియాకు చెందిన నూర్‌, ఆయేషా బెంగళూరు లోని సైట్‌కేర్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఎంటీఈ లుగా పనిచేస్తున్నారు. ఐదుగురు మహిళలతో కూడిన రెండవ బ్యాచ్‌ ప్రస్తుతం నగరంలోని సైట్‌కేర్‌ అలాగే అపోలో ఆసుపత్రిలో ఇంటర్‌నింగ్‌లో ఉంది.
వయసు కేవలం ఓ సంఖ్య
ఎనభై తొమ్మిదేండ్ల వీరమ్మాళ్‌ పాటి (తమిళంలో అమ్మమ్మ) పంచా యతీ అధ్యక్షురాలిగా పని చేస్తుంది. ఆమె నాయకత్వం వహిస్తున్న మదు రైలోని అరిట్టపట్టి గ్రామాన్ని గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదే శంగా ఎంపిక చేసింది. తన మూ డేండ్ల పదవీ కాలంలో వీరమ్మాళ్‌ నాలుగు నీటి ట్యాంకులు, నీటి వనరులపై దాటడానికి వంతెనల నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. అలాగే జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 300 ఇళ్లకు తాగునీటిని అందిం చడంలో సహాయం చేసింది. ప్రస్తుతం ఆమె అంగన్‌వాడీ పాఠశా లలో పని చేస్తోంది. వీధి దీపాలు అమర్చడం, పాడైపోయిన వాటిని బాగుచేయడం ఆమె నిత్య కృత్యం.
పీడితుల గొంతుక…
ప్రముఖ ఆదివాసీ జర్నలిస్ట్‌ జసింతా కెర్కెట్టా… ఒరాన్‌ గిరిజనుల సంఘంలో రెండవ తరం గ్రాడ్యుయేట్‌. తన విద్య తన సమాజానికి, ప్రపంచానికి తిరుగులేని స్వరాన్ని అందించాలని భావిస్తుంది. జార్ఖండ్‌లోని ఓరాన్‌ ఆదివాసీ వర్గానికి చెందిన కెర్కెట్టా చిన్నతనంలోనే గిరిజనులపై జరుగుతున్న శారీరక హింసకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె మామ ఒక మహిళపై లైంగిక దాడి చేసి, హత్య చేసినట్లు తప్పుగా ఆరోపరణకు గురయ్యాడు. ఈ కేసులు తన అమ్మమ్మను కూడా జైలుకు పంపారు. ఈ ఘటన తర్వాత అట్టడుగు వర్గాలను కలవడానికి, వారి అనుభవాలను వినడానికి, రాష్ట్ర గిరిజన ఉద్యమ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆమె గత రెండు దశాబ్దాలుగా జార్ఖండ్‌ అంతటా ప్రయాణించారు. ఆమె జార్ఖండ్‌లోని గ్రామాలలోని గిరిజన యువతులతో సంభాషిస్తూ వారి సమస్యలు పరిష్కరిసర్తూ, వారి కలలను నిజం చేసుకునేందుకు ప్రోత్సహిస్తుంది.
స్పేస్‌ గైనకాలజిస్ట్‌
‘స్పేస్‌ గైనకాలజిస్ట్‌’ అని పిలువబడే డాక్టర్‌ వర్షా జైన్‌ మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై విస్తృత అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో రుతుక్రమ ప్రభావాలను పరిష్కరిండంలో కృషి చేస్తుంది. అంతరిక్షంలో ప్రయాణించే మహిళలు రుతుక్రమాన్ని వాయిదా వేసుకోవడానికి ఆరోగ్యకరమైన పరిష్కారాలను చూపుతుంది. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో రెండు టాయిలెట్లు ఉన్నాయని, నీటి వ్యర్థాలను చాలాసార్లు రీసైకిల్‌ చేసి తాగునీరుగా ఉపయోగిస్తున్నారని ఆమె చెప్పారు. అయితే రక్తాన్ని ఘన పదార్థంగా పరిగణిస్తారు. అందువల్ల రక్తంతో కలిపిన నీటి వ్యర్థాలను డంప్‌ చేయడం, రీ సైకిల్‌ చేయడం సాధ్యం కాదు. ఇంకా సున్నా గురుత్వాకర్షణ వాతావరణంలో నీరు ప్రవ హించనందున మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో స్నానం చేసే అవకాశం లేదు. స్పేస్‌వాక్‌ సమయంలో వారు తమ శానిటరీ ఉత్పత్తులను మార్చకుండా 8 నుండి 10 గంటల పాటు వారి పరికరాలను ధరించాలి. ఇలాంటి సమస్యలకు ఆమె పరిష్కారాలు చూపుతుంది.
పొలం నుండి ఫ్యాషన్‌ వరకు
లడఖ్‌లోని సహకార సంస్థ అయిన ‘లూమ్స్‌ ఆఫ్‌ లడఖ్‌’ 16 గ్రామాలకు చెందిన 450 మందికి పైగా మహిళలు తమ పాష్మినాను ప్రపంచానికి పరి చయం చేసే అవకాశం కల్పించింది. 2015లో జి.ప్రసన్న అనే ఐఏఎస్‌ అధికారి లేలో డిప్యూటీ కమిషనర్‌గా నియమిం చబడినపుడు ఇది ప్రారంభమైంది. చుమూర్‌ గ్రామానికి చెందిన మహిళల బృందాన్ని అతను కలుసుకున్నారు. ‘లడఖ్‌ వంటి కష్టతరమైన భూ భాగంలో మహిళల నైపుణ్యాన్ని చూసి స్ఫూర్తితో కదిలిపోయాడు. ఇదే 150 మంది మహిళలతో ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ లక్సల్‌ అనే నైపుణ్య అభివృద్ధి కార్య క్రమాన్ని ప్రవేశపెట్టడానికి అతన్ని ప్రేరేపించింది. తన భార్య అభిలాష్‌ బహుగుణా ద్వారా వారి కోసం లూమ్స్‌ ఆఫ్‌ లడఖ్‌ అనే సంస్థను స్థాపించాడు. వారికి అల్లికలో శిక్షణ ఇచ్చారు. ప్రారంభించిన తొమ్మి దేండ్ల తర్వాత లూమ్స్‌ ఆఫ్‌ లడఖ్‌ తన ఫామ్‌-టు-ఫ్యాషన్‌ కలెక్టివ్‌లో భాగంగా 450 మంది మహిళలను కలిగి ఉంది. దీని ఉత్పత్తులు ముంబై, సిమ్లా, ఢిల్లీ, బెంగళూరులోని తాజ్‌ హోటల్లోనూ అందుబాటులో ఉన్నాయి.
మరణం తర్వాత గౌరవం
భువనేశ్వర్‌కు చెందిన మధుస్మిత ప్రస్తీ, స్మితా మొహంతి, స్వాగతికా రావు, స్నేహాంజలి సేథీలు కలిసి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మరణించిన తర్వాత వారిని గౌరవంగా సాగనంపుతున్నారు. గత ఏడాది చెన్నై-హౌరా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల కింద వేలాది మంది నిర్జీవమైన మృతదేహాలు ఇప్పటికీ అనాథ శవాలుగా పడి ఉన్నాయి. రక్తపు మరకలు, తెగిన శరీరాలు, ఎడతెగని దు:ఖ వాతావరణాన్ని అది మిగిల్చింది. ఈ నలుగురు మహిళలు జూన్‌ 2న బహనాగా ట్రిపుల్‌ రైలు ప్రమాదం తర్వాత మృతదేహాలను రక్షించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి సహాయం చేసారు. మృతదేహాలను సాగనంపడం ఇప్పుడు వారి రోజువారీ పనిలో ఒక భాగం.
సేకరణ : సలీమ 

Spread the love