అమ్మాయి ప్రొఫైల్‌తో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌

– పలువురి అమ్మాయిలతో చాట్‌..నగ ఫొటోలతో వేధింపులు
– నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమ్మాయి ప్రొఫైల్‌తో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సృష్టించి పలువురు అమ్మాయిలతో పరిచయం పెంచుకుని.. వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వేధిస్తున్న నిందితుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జాయింట్‌ సీపీ ఏవి.రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన జె.కార్తిక్‌ రెడ్డి అమ్మాయిగా చెప్పుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అమ్మాయిలను పరిచయం చేసుకుని వారికి దగ్గరయ్యేవాడు. అతను ఆమే అని నమ్మిన అమ్మాయిలు వారి వ్యక్తిగత చిత్రాలను, వీడియోలను షేర్‌ చేశారు. నిందితుడు వాటిని తన స్నేహితులకు, ఇతరులకు పంపించి పైశాచిక ఆనందం పొందేవాడు.
మరికొన్ని చిత్రాలను మార్ఫింగ్‌ చేసి.. తాను చెప్పినట్టు వినాలంటూ యువతులను వేధింపులకు గురిచేవాడు. ఇదే తరహాలో ఓ మైనర్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన నిందితుడు ఆమెను భయాందోళనకు గురిచేశాడు. తాను చెప్పినప్పుడల్లా నగ వీడియోలు, ఫొటోలు పంపించాలంటూ వేధించాడు. ఆందోళనకు గురైన బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పింది. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులతో ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌మీడియా మాద్యమాలలో పరిచయాలు చేసుకోవద్దని, వారితో చాటింగ్‌ చేయొద్దని జాయింట్‌ సీపీ రంగనాథ్‌, డీసీపీ శిల్పవలి సూచించారు. ఎలాంటి ఫొటోలూ షేర్‌ చేయొద్దని చెప్పారు.

Spread the love