విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి– ఆందోళన చేపట్టిన బాధిత కుటుంబీకులు
నవతెలంగాణ-మెదక్‌
విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా పేరూరు గ్రామంలో బుధవారం జరిగింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు మెదక్‌-బొడ్మట్‌ పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. పేరూర్‌కు చెందిన వెల్మకన్నె నగేష్‌(40) గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలంలో పిచ్చి మొక్కలు తొలగించేందుకు వెళ్ళాడు. కట్టెలు, పిచ్చి మొక్కలను తొలగిస్తుండగా పొలంలో ఉన్న విద్యుత్‌ స్తంభం సపోర్ట్‌ తీగను తాకాడు. తీగకు విద్యుత్‌ సరఫరా కావడంతో పట్టుకున్న వెంటనే షాక్‌ తగిలి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్తంభం వద్ద ప్రమాదం ఉందని గతంలోనే ట్రాన్స్‌కో లైన్‌మెన్‌, ఏఈ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి మరమ్మత్తులు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతితో ఆగ్రహించిన రైతులు అధికారుల వైఖరికి నిరసనగా మెదక్‌-బొడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. ట్రాన్స్‌కో అధికారులను సస్పెండ్‌ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న మెదక్‌ రూరల్‌ సీఐ కేశవులు, ఏఎస్‌ఐ వెంకటయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించలేదు.
ట్రాన్స్‌ కో అధికారులు వచ్చే వరకు ఆందోళన ఆపేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌ బాబు, రూరల్‌ ఏఈ తిరుపతి రెడ్డి వచ్చి.. విద్యుత్‌ మరమ్మతులతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రైతు మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ రావు బాధిత కుటుంబానికి రూ 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ చౌదరి చెప్పారు.

Spread the love