రైతులకు ఇబ్బందులు రానియ్యం

రైతులకు ఇబ్బందులు రానియ్యం– గజ్వేల్‌ రైతులకు మంత్రి కోమటిరెడ్డి హామీ
– ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంటు
– మార్చాలంటూ బాధితుల మొర
నవతెలంగాణ-హైదరాబాద్‌
రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్‌ఆర్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి, ఆలీరాజ్‌పేట్‌, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తామాసాన్‌పల్లి, సామలపల్లి, నెంటూర్‌, బంగ్లవెంకటాపూర్‌, బేగంపేట్‌, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయన్నారు. అయితే తాము ఇప్పటికే మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని తెలిపారు.
మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్‌ఆర్‌ఆర్‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామంటూ బాధితులు మంత్రి దష్టికి తీసుకువచ్చారు. మా పరిస్థితిని మానవతా ధక్పథంతో పరిశీలించి ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చేందుకు చొరవచూపాలని మంత్రి కోమటిరెడ్డిని కోరారు. రైతులతో సుధీర్ఘంగా మాట్లాడిన మంత్రి వారి సాధకబాధకాలను తెలుసుకుని, తాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పిదాల వలన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా.. ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివద్ధికి పాటుపడతామని చెప్పారు.

Spread the love