జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి. రమణ
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని విట్టోలి, తరోడ గ్రామాల్లో బిందు సేద్య పరికరాలు, ఆయిల్‌పామ్ పంటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి. రమణ మంగళవారం తనిఖీ చేశారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి పంట పరిస్థితి, సాగు విధానం, బిందు సేద్య పరికరాల వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బి.వి. రమణ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలను రైతులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో పంటలకు సమర్థవంతంగా నీరందించేందుకు బిందు సేద్యం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి జావిద్ పాషా, ఉద్యాన విస్తరణ అధికారి మోహిని మియా, ఆయిల్‌పామ్ ఏరియా మేనేజర్ ఆకాష్‌తో పాటు ఆయిల్‌పామ్ సాగు రైతులు పాల్గొన్నారు.



