Tuesday, April 21, 2026
E-PAPER
Homeఖమ్మంవైరా మార్కెట్ ముందు రైతుల రోడ్డుపై బైఠాయింపు

వైరా మార్కెట్ ముందు రైతుల రోడ్డుపై బైఠాయింపు

- Advertisement -

– వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి డిమాండ్
– కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
నవతెలంగాణ-వైరాటౌన్
: వైరా మార్కెట్‌లో గత 15 రోజులుగా వరి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు కొనుగోలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించిన రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాదిగా వైరా మార్కెట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే వైరా మార్కెట్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, పట్టణ కార్యదర్శి కొంగర సుధాకర్ డిమాండ్ చేశారు.


రోడ్డుపై రైతుల బైఠాయింపు కారణంగా రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామారావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సమాధానపరిచే ప్రయత్నం చేసినప్పటికీ, రైతులు ఆందోళన విరమించకుండా అధికారులు రావాలని పట్టుబట్టారు.
తరువాత స్థానిక తహసీల్దార్ సురేష్ ఆందోళన స్థలానికి చేరుకుని రెండు రోజుల్లోనే వైరా మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం), రైతు సంఘం, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో వైరా రింగ్ రోడ్డుపై మహా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వైరా పట్టణ కన్వీనర్ సుంకర సుధాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు మల్లెంపాటి రామారావు, హరి వెంకటయ్య, కామినేని రవి, గొల్లపూడి ప్రకాష్ రావు, బెజవాడ వీరభద్రరావు, యనమద్ది రామకృష్ణ, మాదినేని ప్రసాద్, 11వ వార్డు కౌన్సిలర్ దొంతబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -