కొనుగోళ్లలో జాప్యం…ఆందోళనలో రైతులు

నవతెలంగాణ –  మల్హర్ రావు
చేతికందిన ధాన్యం పంట అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల రాశులుగా పోశారు. అకాల వర్షాలతో కుదేలైన రైతులు తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరి తపిస్తున్నారు. విక్రయించడానికి ఇంటిల్లిపాది కొనుగోలు కేంద్రాల వద్దే పడి కాపులు పడుతున్నారు. వర్షాలు తగ్గిన నిర్ణీత తేమశాతం రాకపోవడంతో కొనుగోలు నిర్వాహకులు మొండికేయడం వల్ల రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. తూకం పూర్తయి ధాన్యాన్ని వాహనంలోకి ఎక్కించిన అన్నదాతకు ఊరట కలగడం లేదు. మిల్లర్లు కొర్రీలు పెడుతూ బస్తాలను నింపుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ఇదంతా అధికార యంత్రాంగం కళ్ళముందే జరుగుతున్న పట్టించుకోవడం ఆంతర్యం ఏంటని రైతులు మండిపడుతున్నారు.మండలంలో ఈ తంతు కొనసాగుతుంది. దీంతో ధాన్యం సేకరణ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మండలంలో ఇంకా రుద్రారం,వళ్లెంకుంట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
తేమ పేరుతో..
పంటను అమ్ముకునేందుకు సానా తంతాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసుల కక్కుర్తికి ఆశపడి అధికార యంత్రంగా రైతుల పొట్ట కొడుతోందని తేమ శాతం పేరుతో కటింగ్ విధించి ఏ గ్రేట్ పేరుతో బి గ్రేడ్ మీద కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ ఇవ్వడం అన్నదాతలు కంగుతింటున్నారు. ఏం చేయలేక లబోదిబోమంటూ తలలు బాదుకుంటున్నారు. ఏ గ్రేడ్ తో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బి గ్రేడ్ మీద టచ్ సీట్ ఇవ్వడంతో ప్రశ్నించిన రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మాకు రైస్ మిల్లర్లే సుప్రీమ్ అంటూ సమాధానం ఇస్తున్నట్లు సమాచారం.
Spread the love