ప్రయివేటు పాఠశాలల ఫీజు జులుం..

– యేటా ఫీజులు పెంచుతున్న ప్రయివేటు పాఠశాలలు
– ప్రభుత్వ నియమనిబంధనలు గాలికి
– కొరవడిన అధికారుల పర్యవేక్షణ
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పిల్లలకు మంచి విద్య అందించి వారి భవిష్యత్‌ బాగుండాలని తపించే తల్లిదండ్రుల ఆశను కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు సొమ్ముచేసుకుంటున్నాయి. యేటా ఫీజులు పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి.  బాన్సువాడ డివిజన్ పరిధిలోనీ బాన్సువాడ నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో 25 ప్రైవేట్‌ పాఠశాలు ఉన్నాయి. ఇందులో బాన్సువాడ పట్టణంలో 18 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో 5 వరకు కార్పొరేట్‌ స్థాయి లో కళాశాలు, పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రవేట్ పాఠశాల ఫీజుతో పాటు బుక్స్‌, ల్యాబ్‌, లైబ్రరీ, స్పోర్ట్స్‌ ఫీజులంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.  బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ఓ కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలో ఎల్‌కేజీ విద్యార్థికి ఏడాదికి అన్ని ఫీజులు కలిపి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు గతేడాది కంటే ఈ ఏడాది మళ్లీ అధికమవ్వనున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రైమరీ విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.30వేలు, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు.
నిబంధనలు గాలికి ..
బాన్సువాడ డివిజన్ కేంద్రాల కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఆర్టీఐ 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యలో 25 శాతం మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలి. విద్యుత్ అధికారుల అనుమతి పత్రం, అగ్నిమాపక అధికారులచే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శానిటైజర్ ధ్రువీకరణ పత్రం  పొందాలి. అర్హులైన ఉపాధ్యాయుల చేత విద్యా బోధన అందించాలి. ప్రవేట్ పాఠశాలకు పక్క భవనాలు ఉండాలి. కానీ ఇందులో చాలా వరకు శిథిలావస్థకు చేరిన రేకుల షేడ్లతో పాఠశాలలో కొనసాగుతున్నాయి. గతంలో బాన్సువాడ పట్టణంలో రేకుల షెడ్డు గోడపడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం  బాన్సువాడ డివిజన్ లో ఇలాంటి పాఠశాలలో ఎన్నో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారు. అర్హత లేని ఉపాధ్యాయుల చేత విద్య బోధన కొనసాగుతున్న పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నిబంధనను ఏ ఒక్క పాఠశాలలో కూడా అనుసరించడం లేదు. ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్‌ పాఠశాలలు వ్యవహరిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అమలు కాని ప్రభుత్వ ఉత్తర్వులు ..
రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు 2017లో ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ 2018లో ప్రైవేట్‌ పాఠశాలలో ఏటా 10శాతం ఫీజులు పెంచుకోవచ్చంటూ ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వం కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు. తర్వాత 2020 ఏప్రిల్‌లో అధిక ఫీజులు నియంత్రించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలలో అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయకూడదని నిబంధన ఉన్నది. కానీ  బాన్సువాడ డివిజన్ కేంద్రంలో  ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా విద్యాధికారులు ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకొని అధిక ఫీజులను నియంత్రించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యాధికారుల వాటా ఎంత.? 
బాన్సువాడ డివిజన్ పరిధిలో ప్రైవేటు పాఠశాల  యజమాన్యాలు బుక్స్, డ్రెస్సులు, టై, బెట్లు, బుట్లు, ఐడి కార్డు పేరుతో అధిక వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రైవేటు పాఠశాలలో ఏమైనా వాటా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి వాట లేనప్పుడు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నిబంధనలను ముల్లంగించిన పాఠశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నప్పుడు సౌకర్యాలు కూడా అలా కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజు నియంత్రణలో జిల్లా విద్యాశాఖ అధికారుల చొరవ ఎంతైనా ఉంది.
Spread the love