ఎట్టకేలకు కడెం, మొండికుంటవాగు డీపీఆర్లకు క్లియరెన్స్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
గోదావరి బేసిన్‌లోని కడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, మొండికుంటవాగు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఎట్టకేలకు ఆమోదించింది. ఎప్పుడో పూర్తయిన ప్రాజెక్టులకు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఈ సాంకేతిక అనుమతులు అవసరమయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా నీటి యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరి నీటి యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ల పరిధిలోకి ఆయా ప్రాజెక్టులను తెచ్చాయి. రెండు రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి ఏడాదిక్రితం మళ్లీ డీపీఆర్లు సమర్పించి అనుమతులు పొందాలని కేంద్ర జలసంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు కడెం, మొండికుంటవాగు ప్రాజెక్టులకు సంబంధించి శుక్రవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ కేంద్ర జలసంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దీనికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌, అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ చైర్మెన్‌ రుష్మిందర్‌ వోవ్రా, రాష్ట్ర సాగునీటి ఆయకట్టు శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, హరిరామ్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే , ములుగు జిల్లా సీఈ విజరుభాస్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్లూసీ ఇంజినీర్లు, ఇటు రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు, ఇంజినీర్ల మధ్య చర్చోపచర్చలు సాగాయి. అనంతరం రెండు ప్రాజెక్టుల డీపీఆర్లకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు తెలిపారు.

Spread the love