నేడు విజయవాడలో బిఎస్‌ రావు అంత్యక్రియలు

– తాడిగడప శ్రీచైతన్య మెయిన్‌ క్యాంపస్‌ నుంచి అంతిమయాత్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బిఎస్‌ రావు అంత్యక్రియలు శనివారం విజయ వాడలో జరగనున్నాయి. ఉదయం 8.30 గంటలకు అక్కడి తాడిగడప శ్రీచైతన్య మెయిన్‌ క్యాంపస్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని శుక్రవారం కుటుంబ సభ్యులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో గుండెపోటుతో బిఎస్‌ రావు మరణించిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని విజయవాడ తాడిగడప శ్రీచైతన్య మెయిన్‌ క్యాంపస్‌కు తరలించి సందర్శనార్ధం ఉంచారు. రాజకీయ నాయకులు, విద్యా, వ్యాపారవేత్తలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితోపాటు ప్రజలు తాడిగడపకు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అమెరికా నుంచి ఆయన చిన్న కుమార్తె సీమ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఆయన అంతిమయాత్రను ప్రారంభిస్తారు. ఈడుపుగల్లులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Spread the love