సఫారీ తొలిసారి..

– ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగు
– సెమీస్‌లో అఫ్గనిస్థాన్‌ ఓటమి
నిరీక్షణ ఫలించింది. గండం గడిచింది. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా ఓ ఐసీసీ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసిన సఫారీలు చరిత్రలో తొలిసారి క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. అనూహ్య బౌన్స్‌, పేస్‌, స్వింగ్‌ లభించిన పిచ్‌పై అఫ్గనిస్థాన్‌ 56 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఊదేసిన సఫారీలు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలో ఆడిన అతిపెద్ద మ్యాచ్‌లో ఆ జట్టు అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరిచింది.
నవతెలంగాణ-తరౌబ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో అఫ్గనిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. మార్కో జాన్సెన్‌ (3/16), స్పిన్నర్‌ షంశి (3/6), కగిసో రబాడ (2/14) బంతితో మ్యాజిక్‌ చేశారు. సఫారీ పేసర్లు, స్పిన్నర్ల ధాటికి అఫ్గనిస్థాన్‌ 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. అజ్మతుల్లా ఓమర్జారు (10, 12 బంతుల్లో 2 ఫోర్లు) ఒక్కడే అఫ్గనిస్థాన్‌ తరఫున రెండెంకల స్కోరు అందుకున్నాడు. స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఊదేసింది. రీజా హెండ్రిక్స్‌ (29 నాటౌట్‌, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (23 నాటౌట్‌, 21 బంతుల్లో 4 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌లతో మరో 67 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించారు. సఫారీ పేసర్‌ మార్కో జాన్సెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడనుంది.
అఫ్గాన్‌ విలవిల: టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గనిస్థాన్‌కు ఏదీ కలిసి రాలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి బంతికి మొదలైన వికెట్ల పతనం.. ఎక్కడా ఆగలేదు. పిచ్‌ నుంచి అదనపు బౌన్స్‌, స్వింగ్‌, పేస్‌ లభించటంతో సఫారీ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మార్కో జాన్సెన్‌ వరుస ఓవర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (0), గుల్బాదిన్‌ నయిబ్‌ (9), కారోటె (2) వికెట్లు కూల్చగా.. కగిసో రబాడ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇబ్రహీం జద్రాన్‌ (2), మహ్మద్‌ నబి (0) వికెట్లతో అఫ్గాన్‌ను వణికించాడు. దీంతో పవర్‌ప్లేలో ఐదు ఓవర్లలోనే అఫ్గనిస్థాన్‌ టాప్‌-5 వికెట్లు కోల్పోయింది. పేసర్ల మొదలెట్టిన వికెట్ల వేటను స్పిన్నర్లు కొనసాగించారు. షంశి మాయతో మూడు వికెట్లు పడగొట్టాడు. కరీం జనత్‌ (8), నూర్‌ అహ్మద్‌ (0), నవీన్‌ ఉల్‌ హాక్‌ (2) వికెట్లతో సఫారీ కథ ముగించాడు. మరో పేసర్‌ నోకియా సైతం అజ్మతుల్లా ఓమర్జారు (10), రషీద్‌ ఖాన్‌ (0) వికెట్లతో మెరిశాడు. దీంతో 11.5 ఓవర్లలో అఫ్గనిస్థాన్‌ 56 పరుగులకే కుప్పకూలింది.
ఆడుతూ పాడుతూ: దక్షిణాఫ్రికా అజేయ రికార్డును కొనసాగించింది. పిచ్‌ బౌలర్లకు అనుకూలించటంతో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (5) ఆరంభంలోనే అవుటయ్యాడు. పిచ్‌ స్వభావం అర్థం చేసుకున్న హెండ్రిక్స్‌ (29 నాటౌట్‌), మార్‌క్రామ్‌ (23 నాటౌట్‌) రెండో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించారు. అఫ్గాన్‌ పేసర్‌ ఫరూకీ ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. 8.5 ఓవర్లలో లాంఛనం ముగించిన దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టిన సఫారీలు పెద్దగా సంబురాలు చేయకపోవటం గమనార్హం.
సంక్షిప్త స్కోరు వివరాలు :
అఫ్గనిస్థాన్‌ ఇన్నింగ్స్‌ : 56/10 (అజ్మతుల్లా ఓవర్జారు 10, గుల్బాదిన్‌ నయిబ్‌ 9, జాన్సెన్‌ 3/16, షంశి 3/6, రబాడ 2/14)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : 60/1 (రీజా హెండ్రిక్స్‌ 29 నాటౌట్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌ 23 నాటౌట్‌, ఫజల్‌హాక్‌ ఫరూకీ 1/11).

Spread the love