కారుతో యువతి స్టంట్‌.. ప్రమాదంలో ఐదుగురు..

నవతెలంగాణ హైదరాబాద్: అమెరికా(America)లో ఓ యువతి ప్రమాదకరరీతిలో డ్రైవ్‌ (Dangerous Driving) చేసి తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు(Viral Video) కొడుతోంది. కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ మాల్‌ వెలుపల ఉన్న పార్కింగ్‌ ప్రాంతంలో ఓ యువతి కారును ప్రమాదకరంగా నడపడంతో అది బోల్తా పడింది. ఐదుగురు యువతీ యువకులు ఆ కారు డోర్లపై వేలాడుతూ ఉండగా, కారును వేగంగా వెనక్కి తిప్పడంతో అది పల్టీకొట్టింది. దీంతో కారు డోర్లపై నిల్చున్నవారు కారు కింద నలిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కొలరాడో స్పింగ్స్‌ పోలీసులు స్పందించారు. ప్రమాదానికి కారణమైన ఆ యువతిని అరెస్టు చేశామని, నిర్లక్ష్యపూరితంగా డ్రైవ్‌ చేసినందుకు కేసు నమోదు చేసినట్టు వారు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేసిన యువతికి స్వల్ప గాయాలు కాగా, కారు కింద పడ్డినవారు మాత్రం తీవ్రగాయాల పాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే మాల్‌ దగ్గర ఉన్నవారు సహాయచర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగినట్టు తెలుస్తోంది.

Spread the love