నవతెలంగాణ హైదరాబాద్: ఒడిశాలోని రూర్కెలాలో కలరా కలకలం రేపుతోంది. ఆప్పటికే ఆ మహమ్మారి బారిన పడి ఆరుగురు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కలరా ప్రబలినట్టు ల్యాబ్ పరీక్షల్లోనూ తేలడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అతిసారం, వాంతులతో బాధపడుతున్న వందలాది మంది రూర్కెలాలోని పలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వ్యాధి లక్షణాలతో దాదాపు 500 మంది ఆస్పత్రుల్లో చేరగా, అందులో ఆరుగురు మృతి చెందారని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి పరిస్థితిపై సీఎం పట్నాయక్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
‘కలరా, ఇ.కొలి ఉందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఓఆర్‌ఎస్ తీసుకోవాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్ని కోరాం’ అని ఇక్కడి ఆర్‌జీహెచ్ సూపరింటెండెంట్ సుధారాణి ప్రధాన్ తెలిపారు. సుందర్‌గఢ్, భువనేశ్వర్‌లలో డయేరియా, కలరాబారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించేందుకు అదనంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని తరలించారు. నగరంలో 36 చోట్ల తాగునీటి పైపుల లీకేజ్ ఉందని, కలరా, డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ఆహారం, నీటిని వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.