హైదరాబాద్ : విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ అయ్యారు. మృతుడిని నల్లజాతీయుడిగా గుర్తించారు. ఈ నెల 5న గాంబియాకు చెందిన టీయూఐ ఎయిర్‌వేస్ విమానం ఆ దేశ రాజధాని బంజుల్ నుంచి టేకాఫ్ అయ్యింది. గమ్యస్థానమైన లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే ఆ విమాన చక్రం వద్ద ఒక నల్లజాతి వ్యక్తి మృతదేహం ఉండటాన్ని విమానాశ్రయ సిబ్బంది గమనించారు. దీంతో బ్రిటన్‌లోని ససెక్స్ మెట్రోపాలిటన్ పోలీసులు ఈ విషయాన్ని గాంబియా ప్రభుత్వానికి తెలియజేశారు. కాగా, గాంబియా ప్రభుత్వం ఈ సంఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. విమాన చక్రం వద్ద మరణించి ఉన్న నల్లజాతి పురుషుడి పేరు, వయస్సు, జాతీయత, ప్రయాణ చరిత్రకు సంబంధించిన వివరాలు, తమ దేశీయుడా కాదా అన్నది తెలియదని తెలిపింది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు మృతదేహానికి డీఎన్‌యే టెస్ట్‌ను బ్రిటన్ పోలీసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంలో బ్రిటన్ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించింది. మరోవైపు ఆఫ్రియా దేశాల నుంచి ఐరోపాకు అక్రమంగా వలస వెళ్లేందుకు కొందరు విమాన చక్రాల వద్ద నక్కి దొంగచాటుగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మృత్యవాతపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి.