అసోంలో వరద ఉధృతి

– 10 జిల్లాల్లో ప్రభావం
గౌహతి: అసోంలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం నాటికి 10 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ జిల్లాల్లో ఇప్పటికీ సుమారు 31 వేల మంది వరదలతో ఇబ్బందులు పడుతున్నారని అధికారు లు తెలిపారు. మరోవైపు అస్సాంలో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్‌ఎలర్ట్‌ జారీ చేసింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) విడుదల చేసిన డైలీ ఫ్లడ్‌ రిపోర్టు ప్రకారం చిరాగ్‌, డిరాంగ్‌, థేమాజి, ధుబ్రి, దిబ్రూగఢ్‌, కొక్రాఝార్‌, లఖీంపూర్‌, నల్బరి, సోనిట్‌పూర్‌, ఉదల్‌గురి జిల్లాల్లో 30,700 మందికి పైగా ప్రజలు వరదల బారీన పడ్డారు.
అయితే ఏ జిల్లాలోనూ పునరావస కేంద్రాని ఏర్పాటు చేయలేదు. కానీ 25 పంపిణీ కేంద్రాల ద్వారా సహాయక సామాగ్రిని అంద చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం 444 గ్రామాలు ముంపులో ఉన్నాయని, 4,741.23 హెక్టార్లల్లో పంటలు నాశనమయ్యాయని ఎఎస్‌డిఎంఎ తెలిపింది. అలాగే అనేక ప్రాంతాల్లో కోతలు ఏర్పడుతున్నాయని, కొండ చరియలు విరిగి పడుతున్నాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయని వెల్లడించింది. పట్టణ ప్రాంతాలు కూడా వరద ముంపునకు గురవుతున్నా యని తెలిపింది. బ్రహ్మపుత్రా నదితో సహా రాష్ట్రంలో అన్ని నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని చెప్పింది.

Spread the love