వ్యవస్థీకృత నేరాల నిరోధంపై దృష్టిని కేంద్రీకరించండి

– అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలకు డీజీపీ ఆదేశాలు
– పోలీసున్నతాధికారులతో అర్ధ సంవత్సర క్రైమ్‌ రివ్యూను నిర్వహించిన అంజనీకుమార్‌
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవస్థీకృత నేరాల నిరోధంపై ప్రధానంగా దృష్టిని సారించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఈ అర్ధ సంవత్సరంలో చోటు చేసుకున్న నేరాలపై ఆయన పోలీసున్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ అర్ధ సంవత్సరం రాష్ట్రంలో నేరాల సంఖ్య కొంతమేరకు తగ్గిందని అన్నారు. అయితే, సైబర్‌ నేరాలతో పాటు ఇతర వ్యవస్థీకృత నేరాల నిరోధం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సినవసరం ఉన్నదని ఆయన తెలిపారు. ముఖ్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నమోదు చేసిన కేసుల దర్యాప్తును సాగించాలని ఆయన సూచించారు. నమోదైన కేసులలో నిందితులకు కోర్టులలో కచ్చితంగా శిక్షలు పడేలా చేసినపుడే దర్యాప్తు సాకారమైనట్టుగా భావించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో గతేడాది 55 కేసులలో నేరస్థులకు యావజ్జీవ శిక్షలు పడేలా చూశామనీ, ఈ ఏడాది ఇప్పటి వరకు 85 మంది నేరస్థులకు యావజ్జీవ శిక్షలు పడేలా దర్యాప్తులు సాగటం మంచి ఫలితాన్ని చేకూర్చినట్టయిందన్నారు. కేసుల దర్యాప్తులలో అవసరమైన సహాయ, సహకారాలందించటానికి ఇన్వెస్టిగేషన్‌, ప్రాసిక్యూషన్‌ సలహా బృందాన్ని రాష్ట్ర స్థాయిలో నియమించటం జరిగిందనీ, దాని సహకారాన్ని తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్‌ మాట్లాడుతూ.. ఈ జనవరి నెలలోనే ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా తప్పిపోయిన 1700 మంది పిల్లలను గుర్తించటం జరిగిందనీ, ఇందులో పిల్లలకు సంబంధించి నేరాలకు పాల్పడ్డవారిపై 310 ఎఫ్‌ఐఆర్‌లను కూడా దాఖలు చేయటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, సీనియర్‌ అధికారులు సంజరు కుమార్‌ జైన్‌, ఐజీ షానావాజ్‌ ఖాసీం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love