మేలైన గొర్రె, మేకల రకాలను ఎంచుకోవాలి : జాతీయ మాంస పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ఎస్.బి.బర్బుద్దీ
రెగ్యులేటెడ్ మార్కెటింగ్ వ్యవస్థ రావాలి వెయిట్ బేస్డ్‌గా గొర్రెలు, మేకలను పెంపకందారులు అమ్ముకోవాలి
ఫామ్‌ల ఏర్పాటు విషయంలో యువతను ప్రోత్సహించాలి : సీనియర్ సైంటిస్టు డాక్టర్ బసవరెడ్డి
‘శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెలు, మేకల పెంపకం-సంసిద్ధత’పై అవగాహన సదస్సులో పలు సూచనలు
జీఎమ్‌పీఎస్ ఆధ్వర్యంలో చెంగిచర్ల కబేళాను సందర్శించిన పెంపకందారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేలైన గొర్రెలు, మేకల రకాలను ఎంచుకుని మాంసం ఉత్పత్తిపై దృష్టి సారించాలని గొర్రెలు, మేకల పెంపకం దారులకు జాతీయ మాంస పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ఎస్.బి. బర్బుద్దీ పిలుపునిచ్చారు. గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం 30వ వార్షికోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల సందర్భంగా ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్లలోని ఐసీఏఆర్-ఎన్‌ఎమ్‌ఆర్‌ఐలో ‘శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెలు, మేకల పెంపకంపై సంసిద్ధత, అవగాహన’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాదారు. తమ సంస్థలో మాంసం ఉత్పత్తుల దిగుబడిని పెంచడం, మాంసం ద్వారా అదనపు ఉత్పత్తులను తయారు చేయడం వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు మారుతున్న కాలపరిస్థిలకు అనుగుణంగా ముందుకుసాగాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ నుంచి అధిక మాంసం ఉత్పత్తి అవుతున్నప్పటికీ తెలంగాణకే సరిపోవడం లేదనీ, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో మాంసం ఉత్పత్తులు, ఎగుమతులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఐసీఏఆర్-ఎన్‌ఎమ్‌ఆర్‌ఐకి చెందిన సీనియర్ సైంటిస్టు, డాక్టర్ బసవరెడ్డి గొర్రెలు మేకల పెంపకంలో వస్తున్న మార్పులు, మాంసం దిగు బడి, దాని అనుబంధ ఉత్ప త్తుల తయారీ, పశుపోషణలోని లాభనష్టాలు, విదేశాల్లో మాంసం ఉత్పత్తుల తీరు తదితర అంశాలపై కూలంకషంగా గంటన్నరకుపైగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త పద్ధతుల్లో గొర్రెలు, మేకల పెంపకం చేపట్టాలని సూచించారు. తెలంగాణలో వాటి మాంసానికి అధిక దిగుబడి ఉందనీ, ఇక్కడ పెంచేవాటి మాంసం సరిపోక రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని వివరించారు. ఇలాగైతే మన రాష్ట్రంలోని పెంపకం దారులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. గొర్రెల, మేకల పెంపకం వృతి అత్యంత లాభదాయకతతో కూడుకున్న దనీ, ఈ వృత్తిలోకి వచ్చేందుకు యువతను ప్రోత్సహిం చాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెంచే గొర్రె, మేక మాంసానికి తెలంగాణలో ఉన్నంత రేటు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. అత్యంత బలవర్ధకమైన మాంసం ఉత్పత్తిని ఇంకా పెంచాలని పిలుపునిచ్చారు.
12 నుంచి 14 కేజీలు ఉన్నప్పుడు కాకుండా కనీసం 17 నుంచి 18 కేజీలు మాంసం వచ్చేటట్టు గొర్రెలు, మేకలను పెంచితే లాభాలు అధికంగా వస్తాయన్నారు. వాటి వెయిట్ ఎక్కువ ఉంటే మాంసం ముదిరినట్టు కాదనీ, వయస్సు ఎక్కువ ఉంటే మాంసం ముదిరినట్టు అని వివరించారు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు శిక్షణ ఇప్పించడం, అవగాహన కల్పించిడం వంటి కార్యక్రమాలు మరింత పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వెయిట్ బేస్డ్‌గా గొర్రెలు, మేకలను అమ్ముకునేలా పెంపకం దారుల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. గొర్రె, మాంసం ఉత్పత్తులపై రెగ్యులేటెడ్ మార్కెటింగ్ వ్యవస్థ రావాల్సిన అవసరాన్ని, కబేళాలను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ మీట్‌కు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ కల్పించాలన్నారు. అప్పుడే తెలంగాణలో పెంచే గొర్రెలు, మేకలకు అధిక డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు. సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా గొర్రెలు, మేకల పెంపకం కోసం ఫామ్‌లను నెలకొల్పాలని సూచించారు. ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచే మేకలు, గొర్రెలకు కూడా అధిక డిమాండ్ ఉంటుందని చెప్పారు.
మేలైన గొర్రెలు, మేక రకాలపై పరిశోధనలు జరిగేందుకు తెలంగాణలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్య దర్శులు కిల్లె గోపాల్, ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలను కోసిన తర్వాత మాంసాన్ని 12 గంటల పాటు నిల్వ చేసి తింటే మరింత బాగుటుందని శాస్ర్తవేత్తలు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మాంసం ద్వారా పది, పదిహేను రకాల అదనపు ఉత్పత్తులను తయారు చేయొచ్చనీ, దానిపైనా పెంపకం దారులు దృష్టి సారించాలని సూచించారు. పామ్ సిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీలేని ఆహారం మాంసమేనని తెలిపారు. సాంప్రదాయ పద్ధతుతలను వీడి శాస్ర్తీయ పద్ధతుల్లో గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపడితే అధిక లాభాలు వస్తాయని వివరించారు. కాగా ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చెంగిచెర్ల కబేళాను సందర్శించారు. అక్కడకు వచ్చిన వివిధ గొర్లు, మేకల జాతుల గురించి, మాంసం ఆధారిత అదనపు ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.



