Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట మార్పిడి పాటించండి..సుస్థిర ఆదాయాన్ని పొందండి

పంట మార్పిడి పాటించండి..సుస్థిర ఆదాయాన్ని పొందండి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 29 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత  మాట్లాడుతూ పంట మార్పిడి విధానం అనుసరించడం ద్వారా నేలలో పోషకాల సమతుల్యత నిలబడుతుందని వివరించారు.

ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోతుందని తెలిపారు. సాధారణంగా ఒకే పంటను పదేపదే వేస్తే, ఆ పంటకు అవసరమైన పోషకాలు నెలలో తగ్గిపోతాయని,పంట మార్పిడి ద్వారా భూసారం పెరిగి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. పంట మార్పిడి వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు నేల సారం మెరుగుపడుతుందని, కీటకాలు, వ్యాధుల ప్రబలత తగ్గుతుందని, ఇదే కాకుండాఎరువుల వినియోగం తగ్గుతుందని, పంటల దిగుబడి పెరుగుతుందని, రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని, పంట మార్పిడి పాటించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, పర్యావరణానికి హాని లేకుండా సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని చెప్పారు.

రైతులు తమ భూమి పరిస్థితులు, నీటి లభ్యత మరియు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరైన పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎ రామకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ ఎల్ రవికుమార్, పరిశోధన కేంద్రం విద్యార్థి వంశీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ కుమార్, విస్తరణ అధికారి కె ప్రశాంత్, తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -