నగరపు వీధుల్లో
ఇప్పుడెలా వెలుగుతున్నాయో తెలుసా దీపాలు?
నూనెతో కాదు…
మనుషుల భయాలతో.
ప్రతి గల్లీ మూలన
ఒక జెండా నిలబడి ఉంది,
దేశాన్ని కాపాడటానికి కాదు,
మనిషిని మనిషి నుండి వేరు చేయడానికి.
పుస్తకాల అలమారల్లో
రాజ్యాంగం పదిలంగా ఉంది,
బహిరంగ సభల మైకుల్లో
దాని అక్షరాలు శవపేటికలై రాలుతున్నాయి.
సత్యం ఇప్పుడు
న్యూస్ ఛానెల్ స్క్రీన్ దిగువన పరుగెత్తే
ఒక చిన్న ‘బ్రేకింగ్’ పంక్తి మాత్రమే;
అబద్ధం మాత్రం
దేశభక్తి రంగు పూసుకుని ఊరేగుతోంది.
దేవుళ్లు కూడా అయోమయంలో ఉన్నారు,
ఎవరిని రక్షించాలో తెలియక.
ఎందుకంటే
వారి పేర్లతోనే కదా
ఇళ్లను కాల్చుతున్నారు, కూల్చుతున్నారు.
ఒక చిన్నారి
పాఠశాల బస్తాలో పుస్తకాలు కాదు,
తండ్రి భయాన్ని మోస్తోంది.
రైతు చేతిలోని మట్టికణం
ఇప్పుడు ధాన్యపుగింజ కాదు,
అనేక ఎన్నికల మేనిఫెస్టోల సమాధి.
కవులు ఇంకా ఏమి రాయాలి?
నదుల్లో రక్తం ప్రవహిస్తుంటే,
పావురాలు పొగతో దగ్గుతుంటే,
మనిషి గుండెలపై
మతం కంచె కడుతుంటే,
ఇప్పుడిక ఈ నేల
వర్షం కోసం కాదు,
కొంచెం మానవత్వం కోసం ఎదురుచూస్తోంది.
– యండి. ఉస్మాన్ ఖాన్
కొంచెం మానవత్వం కోసం…
- Advertisement -
- Advertisement -



