ప్రపంచం సాంకేతిక రంగంలో ఎంతగా దూసుకుపోతున్నా మహిళలకు మాత్రం ఆ రంగంలో సముచిత స్థానం లేదు. మహిళలకు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఆ స్థానాన్ని అందించాలని నిత్యం కృషిచేస్తున్న వ్యక్తి శ్రేయ కృష్ణన్. దాని కోసమే ఆమె AnitaB.org ఇండియాతో కలిసి పని చేస్తున్నారు. దీనితో కలిసి యువత, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, వికలాంగులకు సాంకేతిక విద్యలో అవసరమైన శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తున్నారు. ఇలా తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మహిళల అభ్యున్నతి కోసమే అంకితం చేసిన ఆమె పరిచయం నేటి మానవిలో…
పర్యావరణ శాస్త్రాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన శ్రేయ కృష్ణన్ ప్రపంచాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ‘నేను గ్రీన్‌పీస్ జనరేషన్‌లో భాగమయ్యాను. పర్యావరణ జర్నలిస్టుగా మారాలనుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యావరణ సమస్యలపై కథనాలను కవర్ చేయాలని నిర్ణయించుకున్నాను. దీనికోసం జర్నలిజం కోర్సులు పూర్తి చేసి ది హిందూలో చేరాను’ అని ఆమె ఓ ఆంగ్ల వైబ్‌సైట్‌తో పంచుకున్నారు.
సమానత్వం కోసం…
శ్రేయ ప్రస్తుతం AnitaB.org ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె జీవితం, వృత్తి ఎల్లప్పుడూ సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్, ఫస్ట్ అడ్వాంటేజ్‌తో కలిసి పని చేశారు. అలాగే అనేక లాభాపేక్ష లేని సంస్థల సలహా బోర్డులో కూడా ఉన్నారు. AnitaB.orgలో చేరే ముందు ఆమె అయాన్‌లో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, సీఎస్‌ఆర్, డి అండ్ ఐ హెడ్‌గా పని చేశారు. ‘వివిధ మార్గాల్లో నేను AnitaB.org లో భాగమయ్యాను. 2019లో బెంగళూరులో జరిగిన దాని గ్రేస్ హాప్పర్ సెలబ్రేషన్‌లో యాంకర్‌గా ఉన్నాను. 2022లో యుఎస్‌కి హోస్ట్‌గా వ్యవహరించాను. గత ఏడాది ఏప్రిల్‌లో అడ్వైజరీ బోర్డులో చేరాను. నెలరోజుల్లోనే వారు నన్ను ఫుల్‌టైమ్‌లో చేరమని అడిగారు’ అని శ్రేయ అన్నారు. చికాగోకు చెందిన AnitaB.org అనేది ప్రపంచవ్యాప్త లాభాపేక్ష లేని సామాజిక ప్రభావ సంస్థ. ఇది సాంకేతికతలో మహిళలు, ట్రాన్స్ జెండర్స్‌ని అభివృద్ధి చేయడం కోసం పని చేస్తోంది. సాంకేతిక పరిశ్రమలో వారి సమానత్వం కోసం కృషి చేస్తుంది. వారు కెరీర్‌లో రాణించడానికి, సాధికారత కల్పించడానికి వివిధ కార్యక్రమాలు రూపొందిస్తుంది.
సమ్మిళిత సాంకేతికత వైపు
సాంకేతికత నేడు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని శ్రేయ బలంగా నమ్ముతున్నారు. సాంకేతికత ఎవరి ద్వారా నిర్మించబడిందనేది మాత్రమే కాదు, ఎవరి కోసం నిర్మించబడిందనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. ‘టెక్, ఇది చాలా కఠినమైనదే. అయితే ఇది ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది సజాతీయమైన వ్యక్తులచే నిర్మించబడింది. ఇది అందరికీ సమానమైన, ఉపయోగించలేని సాంకేతికతను సృష్టిస్తుంది. అందుకే మేము మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఇందులో సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాము’ అంటున్నారు ఆమె.
సంఘాలు, సంస్థల కోసం
AnitaB.orgలాభాపేక్షతో కూడిన సామాజిక సంస్థ. పర్యావరణ వ్యవస్థలోని వివిధ భాగాలతో పనిచేస్తుంది. ఇది 1,06,000 మంది మహిళలు, భారతదేశంలో 6,000 మందితో కూడిన గ్లోబల్ కమ్యూనిటీని కలిగి ఉంది. ఇది మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రతి మూడు నెలలకు ఓసారి ప్రత్యక్షంగా కలుసుకుంటుంది. ప్లాట్‌ఫారమ్‌లో లెర్నింగ్ మాడ్యూల్స్‌తో పాటు టెక్, నాన్-టెక్ కంటెంట్ అందుబాటులో ఉంది. దేశంలోని టైర్ III, IV పట్టణాలలో యువతుల కోసం పాఠ్యాంశాలను కూడా సిద్ధం చేస్తోంది. ‘మా క్లయింట్ నెట్‌వర్క్ వారి లక్ష్యాలు నెరవేరేలా చూసే సంస్థలు. మా భాగస్వామి నెట్‌వర్క్‌లో షీరోస్, ఆస్పైర్ ఫర్ హర్ ఫౌండేషన్, హర్ కీ, ఇంటర్‌వీవ్ వంటి సంస్థలు ఉన్నాయి. వారితో మేము పరిశోధనలు చేస్తాం’ అని ఆమె వివరించారు. అంతేకాకుండా AnitaB.org ”రిటర్న్ టు వర్క్” ప్రోగ్రామ్ ద్వారా కెరీర్‌ల నుండి విరామం తీసుకున్న మహిళలకు మెంటార్‌షిప్, లెర్నింగ్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఇది ‘అప్రెంటిస్‌షిప్ పాత్‌వే’ని కూడా కలిగి ఉంది. దీనిలో యువతను భాగస్వామ్యం చేస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్ మహిళలకు, ట్రాన్స్ జెండర్స్‌కు, వికలాంగులకు కెరీర్ సవాళ్లపై పరిశోధనపై అవగాహన కల్పిస్తుంది. కాలేజీలలో ఇంటరాక్టివ్ సెషన్‌లు, మీట్‌అప్‌ల ద్వారా అకాడెమియాతో పని చేస్తుంది.
ఉద్యోగం ఎందుకు?
సంస్థ ఐదేండ్ల విరామం తర్వాత నవంబర్ 20-22 వరకు గ్రేస్ హాపర్ సెలబ్రేషన్ ఇండియాని నిర్వహిస్తోంది. బెంగళూరు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి 15,000 మంది మహిళలు, 240 మంది వక్తలు హాజరవుతారని అంచనా. దీని ప్రచారం కోసం 11 నగరాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది పిచ్ హర్‌ను భారతదేశానికి తీసుకురావాలని యోచిస్తోంది. ఇక్కడ మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను రూపొందించుకుంటారు. పెట్టుబడిదారుల నుండి నిధులు అందుకుంటారు. ‘మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. పర్యావరణ వ్యవస్థపై అవగాహన కల్పించాలి. మీకు ఉద్యోగం ఎందుకు అవసరం? అనేవి వారికి చెప్పాలి. సమాజికంగా అభివృద్ధి చెందకుండా మహిళలను నిలువరించేందుకు ఉపయోగించే అతి పెద్ద మార్గం వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించకుండా చేయడమే. కనుక అటువంటి మార్గాన్ని మనం ఎవ్వరికీ ఇవ్వకూడదు’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.