పరుగుల రాణి కొడవత్ స్వప్న..
3వేల మీటర్ల స్టీపుల్‌చేస్‌లో స్వర్ణ పతకం..
కొడవత్ తండాకు గర్వకారణంగా నిలిచిన స్వప్న
నవతెలంగాణ – తిమ్మాజిపేట
కష్టాలు ఎన్ని ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమేనని నిరూపించింది స్వప్న నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ కొడవత్ తండాకు చెందిన కొడవత్ స్వప్న నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయికి ఎదిగిన స్వప్న తాజాగా పుదుచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3వేల మీటర్ల స్టీపుల్‌చేస్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించింది.
ఆటో డ్రైవర్ గా తండ్రి..కూలీ పనులు చేసే తల్లి..
స్వప్న తండ్రి కొడవత్ మాన్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్వప్నలోని క్రీడా ప్రతిభను గుర్తించి ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు.
బాబాయ్ రవి చూపిన దారే తొలి అడుగు..
చిన్నతనం నుంచే స్వప్న తన బాబాయ్ కొడవత్ రవి ప్రతిరోజూ రన్నింగ్ కు వెళ్లడం గమనించేది. అతనిని చూసి స్వప్నకు కూడా పరుగుపందేలపై ఆసక్తి పెరిగింది. స్వప్నలోని ఆసక్తిని గమనించిన రవి ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. క్రీడలపై ఆమెకు ఉన్న అంకితభావం, ప్రతిభను గుర్తించి నాలుగో తరగతిలోనే స్పోర్ట్స్ స్కూల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి స్వప్న ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. 10వ తరగతి వరకు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యాభ్యాసంతో పాటు అథ్లెటిక్స్‌లో కఠోర శిక్షణ పొందింది.
ఎస్ఏఐలో ఎంపిక..కోచ్ సుబ్బారావు మార్గదర్శకత్వం..
తర్వాత స్వప్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) లో ఎంపికై, అక్కడ శిక్షణ పొందే అవకాశం దక్కించుకుంది. కోచ్ సుబ్బారావు మార్గదర్శకత్వంలో నిరంతర సాధన చేస్తూ తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంది. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో స్వప్న ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించింది. ప్రతి పోటీలోనూ తన ప్రతిభను చాటుతూ జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేస్‌లో అద్వితీయ ప్రదర్శన తాజాగా పుదుచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3000 మీటర్ల స్టీపుల్‌చేస్‌లో స్వప్న అద్భుతమైన ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే.. లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో జాతీయ స్థాయి వేదికపై స్వర్ణ పతకంతో మెరిసింది.
అంతర్జాతీయ వేదికే తదుపరి లక్ష్యం
జాతీయ స్థాయిలో సాధించిన ఈ విజయంతో స్వప్న లక్ష్యం మరింత ఉన్నతమైంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యం అని స్వప్న చెబుతోంది. పరిస్థితులు మన కలలను నిర్ణయించవు మన పట్టుదలే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అన్నట్టుగా స్వప్న సాగిస్తున్న ఈ విజయ ప్రస్థానం గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కొడవత్ తండా నుంచి జాతీయ క్రీడా వేదిక వరకు సాగిన స్వప్న పరుగులు ఇక అంతర్జాతీయ పతకాల వైపు సాగాలని గ్రామస్థులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కొడవత్ తండా గర్వించేలా నాగర్‌కర్నూల్ పేరు నిలిపేలా.. భారత జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించేలా స్వప్న మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.



