నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శాసనసభలో శుక్రవారం మాట్లాడారు. సింగరేణి సంస్థకు సత్తుపల్లి ప్రాంతం 12వ బొగ్గు గనుల ఏరియాగా ఉందని, ప్రస్తుతం సంస్థ మొత్తం ఉత్పత్తిలో 20 శాతం బొగ్గు ఇక్కడి నుంచే లభిస్తోందని సభ దృష్టికి తెచ్చారు.
జేవీఆర్-ఓసీ-3 బొగ్గు వెలికితీత కాంట్రాక్టు దక్కించుకున్న ‘అవంతిక’ సంస్థ ఐదేళ్లయినా పనులు ప్రారంభించలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. కాంట్రాక్టును రద్దు చేసి ఆ పనులను సింగరేణికే అప్పగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. దీనివల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లిలో జీఎం కార్యాలయం ప్రారంభించి ఏడాదవుతున్నా పూర్తిస్థాయి డిపార్ట్‌మెంట్లు ఏర్పాటు కాలేదని తెలిపారు. దీనివల్ల చిన్న పనులకు కూడా కార్మికులు కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోందని, మిగతా విభాగులను వెంటనే అందుబాటులోకి తేవాలని కోరారు. గ్రామాల్లో ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్లను తీయించాలని, అలాగే ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభాలను మార్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.



