క్రికెట్‌లోనూ ఇక నుంచి రెడ్‌ కార్డ్ నిబంధన..

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో కొత్త నిబంధన రానుంది. ఈ ఫార్మాట్‌లో ఇన్నింగ్స్ కు నిర్ణీత 20 ఓవర్లను పూర్తి చేసేందుకు ఆయా జట్లు అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ఎన్నిసార్లు జరిమానా విధించినా ఈ ఫార్మాట్‌ లో స్లో ఓవర్‌ రేట్‌ అనే జాఢ్యం పెరిగిపోతూనే ఉంది. దీన్ని కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌  నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫుట్‌బాల్‌, హాకీ తరహాలో రెడ్‌ కార్డును ప్రవేశపెట్టారు. ఆఖరి (20వ) ఓవర్‌ నిర్ణీత సమయానికి మొదలవకపోతే ఫీల్డింగ్‌ జట్టుకు రెడ్‌ కార్డ్‌ చూపిస్తారు. అప్పుడు ఓ ఆటగాడు మైదానం వీడాల్సివుంటుంది. ఆ ఆటగాడు ఎవరనేది ఫీల్డింగ్ చేసే జట్టు కెప్టెన్ నిర్ణయిస్తాడు. ప్రస్తుతం సీపీఎల్‌లో నిర్ణీత సమయానికి 18వ ఓవర్‌ ప్రారంభమవకపోతే ఒక ఫీల్డర్‌ను, 19వ ఓవర్‌ కూడా ఆలస్యమైతే ఇద్దరు ఫీల్డర్లను ఇన్నర్‌ సర్కిల్‌లోకి తీసుకొచ్చే నిబంధన ఈపాటికే అమలులో ఉంది. ఇప్పుడు రెడ్‌కార్డ్‌తో మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఒకవేళ బ్యాటర్లు సమయం వృథా చేస్తే కూడా అంపైర్లు చర్యలు తీసుకుంటారు. మొదట అంపైర్లు రెండుసార్లు బ్యాటింగ్ చేసే జట్టును హెచ్చరిస్తారు. ఆ తర్వాత నుంచి వార్నింగ్‌ ఇచ్చిన ప్రతిసారి పెనాల్టీ కింద బ్యాటింగ్ జట్టు ఖాతా నుంచి 5 పరుగుల కోత విధిస్తారు.

Spread the love