ఈ రోజు నుంచి జగన్ ను ఏకవచనంతో పిలుస్తాను: పవన్ కల్యాణ్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏలూరులో వారాహి విజయ యాత్ర సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఎప్పట్లాగానే వాడీవేడిగా ప్రసంగించారు. సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారాహి విజయ యాత్ర రెండో దశకు ఏలూరులో ఇంతటి ఘనస్వాగతం లభిస్తుందని తాను అనుకోలేదని, దారిపొడవునా అక్కచెల్లెళ్లు, తల్లులు ప్రేమాభిమానాలు చూపించారని వెల్లడించారు. తానేమీ సరదాగా రాజకీయాల్లోకి రాలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేను ఇన్ని బాధలు, అవమానాలు ఎందుకు పడాలి? గెలుపోటములతో పనిలేకుండా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని వివరించారు. అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంచివాడా, చెడ్డవాడా అని చూడకుండా, సీఎం స్థానానికి విలువ ఇచ్చి జగన్ రెడ్డి గారు అని గౌరవించానని తెలిపారు. అయితే, ఈ రోజు నుండి అంబేద్కర్ సాక్షిగా జగన్ రెడ్డిని ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని వ్యాఖ్యానించారు. అతడి పార్టీ వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని అన్నారు. 2024లో జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. “మనమేమీ వైఎస్ జగన్ కు బానిసలం కాదు… ఆయన కూడా మనలో ఒకడే. మనం ట్యాక్సులు కడితే ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తి. సీఎం అంటే కేవలం జవాబుదారీ మాత్రమే” అని వివరించారు. “ఈ జగన్ ఎలాంటివాడంటే… నేను ఏం మాట్లాడినా వక్రీకరించి, వంకరగా, వెకిలిగా మాట్లాడతాడు. నేను ఏం మాట్లాడినా అది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. కానీ ఈ వైసీపీ నేతలు ఏ సంబంధంలేని నా భార్యను, రాజకీయాలు తెలియని నా తల్లిని తిడుతున్నారు. నేను ప్రజల కోసం మాట్లాడుతుంటే, వారు నా కుటుంబాన్ని, ఇంట్లోని ఆడవాళ్లను తిడుతున్నారు” అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హలో ఏపీ… బైబై వైసీపీ అనే నినాదం ప్రజల బాధలు పడ్డాక బయటికి వచ్చిందని, అది తాను చేసిన నినాదం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన నినాదం అని తెలిపారు.

Spread the love