రాష్ట్రానికి నిధులివ్వండి

రాష్ట్రానికి నిధులివ్వండి– కేంద్ర ఆర్థికమంత్రికి రాష్ట్ర ఆర్థిక
– మంత్రి భట్టి విక్రమార్క వినతి
నవతెలంగాణ:న్యూఢిల్లీ
రాష్ట్రానికి నిధులివ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు. శనివారం నాడిక్కడ భారత్‌ మండపంలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్‌ సన్నాహాక సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.”రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్ధిక సహాయం పథకాన్ని ఏడాదికి రూ. 2.5 లక్షల కోట్లకు పెంచి కొనసాగించాలి. ఈ పథకంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు బ్రాండింగ్‌ వంటి షరతులు, ఇతర
పరిమితులు లేకుండా నిధులను విడుదల చేయాలి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను పున: సమీక్షించి, అనవసరమైన పథకాలను తొలగించి, ఆప్షనల్‌గా కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి. దేశం ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆదాయ పంపిణీలో అసమానతలు ప్రధానమైనవి. ఈ బడ్జెట్‌లో ఈ రెండు సమస్యలపై కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఎక్కువ నిధులను కేటాయించాలి” అని కోరారు. ”దేశ యువత నైపుణ్య స్థాయి నిరుద్యోగంతో సంబంధం ఉన్న ప్రధాన సమస్య. వారికీ ఉద్యోగ అవకాశాలు అందించడానికి నూతన నైపుణ్యాలలో శిక్షణ మెరుగుపరచడం అవసరం. రాష్ట్రాలలో ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆధునీకరించాలి. రాష్ట్రాలకు ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా తగ్గింది. సెస్‌లు, సర్‌ చార్జీలతో సేకరించిన మొత్తం పెరగడం వల్ల రాజ్యాంగ సంస్థల సిఫార్సులు మాత్రమే కాకుండా రాష్ట్రాల ప్రయోజనాలను కూడా ప్రభావితం చేసింది. అందుకని, మొత్తం పన్ను ఆదాయానికి శాతంగా సెస్‌లు, సర్‌ చార్జీల వాటా 10 శాతం మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. ”బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని సీలింగ్‌ ని తెలియజేయాలి. ఫలితంగా రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ వనరులను సమర్థవంతంగా ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోగలుగుతాయి” అని అన్నారు.
తెలంగాణ రాష్రానికి సంబంధించిన అంశాలు
”తెలంగాణ అనేక రంగాలలో గొప్ప పురోగతిని సాధించడంతో పాటు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం అవసరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా, మా రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) కింద విడుదలయ్యే నిధుల తగ్గింపు. కేంద్ర పన్నుల వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం” అని అన్నారు. ”కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి. ఏకపక్షంగా లేదా కొన్ని రాష్ట్రాలపట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాలి. మా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే, 2023-24లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం రూ.4,60,000 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం రూ.6,577 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 1.4 శాతం మాత్రమే. ఇది జనాభా నిష్పత్తి ప్రకారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల, సీఎస్‌ఎస్‌ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం, నిర్ణీత సమయంలో చేయాలి” అని కోరారు.
”ఏపీ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం సెక్షన్‌ 94(2) కింద, రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రూ.450 కోట్లను ఇవ్వాల్సి ఉంది. అయితే రూ.2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదు. అందువల్ల, రూ.2,250 కోట్లు విడుదల చేయాలి. హైదరాబాద్‌ మినహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించిన నేపధ్యంలో ఈ గ్రాంటును వచ్చే ఐదేండ్ల పాటు పొడిగించాలి” అని కోరారు.
”రాష్ట్రం ఏర్పాటైన మొదటి ఏడాదిలో, తెలంగాణ కోసం మంజూరైన రూ.495.21 కోట్ల సిఎస్‌ఎస్‌ గ్రాంట్లు పొరపాటుగా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారు. ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి ఇవ్వాలని కోరుతున్నాం. ఉపాధి హామీ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను తొలగించాలి” అని కోరారు.
”పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం మూసి రివర్‌ డెవలప్మెంట్‌ కోసం అధిక నిధులు కేటాయించాలి. ఏజెన్సీల నుండి నిధుల సేకరించడానికి పిపిఆర్‌ లు సమర్పించాం. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి సహకరించాలి. తెలంగాణకు మరిన్ని నవోదయ పాఠశాలలను కేటాయించాలి. ప్రధాని సూర్యఘర్‌లో విద్యుత్‌ సబ్సిడీ – ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద సబ్సిడీ నిధులను రూటింగ్‌ చేయడానికి కేంద్రం సహకరించాలి” అని అన్నారు.
”ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జిఎస్టి మినహాయించాలని కోరారు. అదనపు న్యూట్రల్‌ ఆల్కహాల్‌ ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి. పన్ను, జరిమానా వడ్డీ మినహాయించాలి. రేట్‌ రేషనలైజేషన్‌ కమిటీ నివేదిక సమర్పిచాలి” అని కోరారు.

Spread the love