గాజా… ఓ.. గాజా!

”నేనీరోజు నిదురించేలోగా
మరికొంత మంది శిశువుల కలలు హత్యకు గురౌతాయి
నేను వారి శవాల గుట్టల మీద నిల్చుని
యుద్ధాలాటపై ఎడతెగని వ్యాఖ్యానం వింటూనే వుంటాను…
అదేమిటో పీడకులు ఎన్నిసార్లు చంపినా, గాజాలో ఎవ్వడూ చావడం లేదు.” అని పాలస్తీనా ప్రజల పోరాటాన్ని గానం చేస్తుంది మౌమితా ఆలం. నిజమే ఇన్ని నెలలుగా గాజాపై బాంబులు కురుస్తూనే వున్నా, విధ్వంసం కొనసాగుతున్నా, ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలస్తీని యన్ల పోరాటం, నిరంతర ప్రతిఘటన ఆగలేదు. శిథిలాల మధ్య, రాళ్ల కుప్పల మధ్య, శవాల గుట్టల మధ్య, దారుణ దృశ్యాల మధ్య జన్మభూమి కోసం రక్తం చిందిస్తూనే ఉంది పాలస్తీనా. ఎన్ని దారుణాలు మనమంతా చూస్తుండగానే జరిగిపోతున్నాయి. సొంత నేలపై, సొంత దేశంలో ఎక్కడ ఉండాలో తెలవక పరుగులు పెడుతున్న జనుల ఆక్రందనలు ఎవరైనా వింటున్నారా! కంటున్నారా? మొన్నటికి మొన్న జరిగిన సంఘటన ఏ గుండెనయినా కదిలించక మానదు. దేశపు సరిహద్దులు మనుషులంగా మనం గీసుకున్నవే. ఆ బారికేళ్లను చెరిపేస్తే, ఎక్కడి మనుషులైన… ఈ ధరిత్రి వాసులేకదా! మన గుండె స్పందించొద్దూ! దుర్మార్గపు చర్యను ఖండించొద్దూ! సామ్రాజ్యవాద అమెరికా, నాటో కూటమీ ఇజ్రాయిల్‌ కలిసి సాగిస్తున్న మానవ హననాన్ని మౌనంగా, మనకేమీ సంబంధం లేనిదిగా చూస్తూ ఊరుకోవడం, మనిషి లక్షణంగా ఉండదు. సరికదా ఇంకనూ ఇజ్రాయిల్‌కు వంతపాడితే మనుషులంగా మనమెట్లా బతికున్నట్టు!
గత కొన్ని నెలలుగా అక్కడ రాళ్లకుప్పలు, రక్తపు ముద్దలు తప్ప కాలే కడుపుకు కాసింత రొట్టె ముక్కకు నోచుకోని పసికూనలు, వృద్ధులు, మహిళలు, శిశురోదనలు ఎవరు వింటున్నారు. ఏమీలేక, ఏమీ దొరకక, గాజా జన సామాన్యమంతా ఆకలి కేకలతో అల్లాడి పోతున్నారు. ఆఖరికి గడ్డిని ఏరుకుంటున్నారు., పశుగ్రాసాన్ని పంచ భక్ష పరమాన్నంలా నమిలి మింగుతున్నారు. అమ్మా! ఆకలేస్తోంది… అని రోదిస్తూ చేయి చాస్తున్న పిల్లలకు ఏమీ పెట్టలేని తల్లుల మాన సిక వ్యధ ఎలా ఉంటుంది. మూడు, నాలుగు నెలలుగా ఆకలితో దాహంతో సహవాసం చేస్తున్న ఆ సమూహంలోకి కొన్ని ట్రక్కులు, మీ కోసమే అంటూ దూసుకువచ్చాయి. అందులో రొట్టెల పిండిని మోసుకు తెచ్చాయి. అసలే నెలలుగా ఆహారం కోసం ఎదురు చూస్తున్న గాజా వాసులు, కాలేకడుపులోకి కాసింత రొట్టె వెయొచ్చని గుమిగూడారు. ట్రక్కుల నుండి ఆహారాన్ని పంచేది కూడా, వీళ్ల ఆకలికి కారణమైన ఇజ్రాయిల్‌ సైనికులే కావటం ఓ విషాదం. ఆ ట్రక్కుల చుట్టూ పిండికోసం ఎగబడ్డారు. ఒకరినొకరు పడదోసు కున్నారు. అడ్డమొచ్చిన సైనికులనూ తోసివేసారు. ఇంకేం చేయ గలరు వాళ్లు! ఆకలికి ఎవరైనా చేసేపనే అది. ఇజ్రాయిల్‌ సైనిక పాఠవానికి ఆగ్రహం కలిగింది. ఆకలితో పిండి కోసం అర్రులు చాచుతున్న ఆ సమూహంపైకి వైమానికి దాడిని ఆరంభించారు. తూటాలు కడుపుల్లోకి దూసుకుపోయాయి. ప్రభుత్వాల లెక్కల్లో 112 మంది పిట్టల్లా రాలిపోయారు. దాదాపు 500 మంది రక్తమోడుతూ తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లంతా బాలలు, వృద్ధులు, మహిళలు. దక్షిణ గాజాలోని ‘రషీద్‌ స్ట్రీట్‌’లో మానవతా సాయం కోసం ఎదురుచూసిన వాల్లంతా, ఏ సహాయమూ అవసరంలేని లోకంలోకి శాశ్వతంగా చేరుకు న్నారు. ఇది అమానుష దాడి, పాశవిక చర్య, ఇజ్రాయిల్‌ ఆర్మీ సాగించిన ఈ మారణకాండ కేవలం పాలస్తీనీయులపై జరిపిందే కాదు. మొత్తం మానవాళిపై జరిగిన దాడిగా, మహానేరంగా పరిగణించాలని టర్కీ వాఖ్యానించటం అక్షరాల నిజం.
ఇప్పటికే అమెరికా అండతో ఇజ్రాయిల్‌ చేస్తున్న భూ, గగనతల దాడుల్లో ముప్పయి వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పో యారు. డెబ్బయి వేలకు పైగా క్షతగాత్రులుగా బాధలు పడుతున్నారు. పిల్లల ముందే తల్లిదండ్రులు మరణిస్తున్నారు. తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు కనుమూస్తున్నారు. ఆకలేస్తే అన్నం లేదు… కాళ్లూ చేతులూ విరిగి రక్త మోడుతున్నా, అనారోగ్యంతో చావుబతుకుల్లో వున్నా వైద్యం లేదు. ఆస్పత్రులపైనా బాంబులు కురుస్తున్నాయి. ఈ దారుణాలను చూసిన దక్షి ణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయిల్‌పై కేసు కూడా వేసింది. వెంటనే ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని ఆపివేయాలనీ కోర్టు కోరింది. అయినా దాడులపలేదు. ఇప్పుడు ఆకలితో చేయిచాచిన వారినీ పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్య సమితి కార్యదర్శి అంటోనియా గుటెరస్‌ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటలీ, స్పానిష్‌, ఖతార్‌, సౌదీ, యురోపియన్‌ యూనియన్‌, చైనా మరెన్నో దేశాలు సంఘటన ఖండించాయి. కానీ ఇండియా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ వుంది. దుర్మార్గాన్ని ఖండించడానికి కూడా మోడీ ప్రభుత్వం వెనుకాడుతోంది. ఇంత ఘోర మారణకాండ జరిగినా భారత్‌, అమెరికాకు వంత పాడే వైఖరిని తీసుకోవటం శోచనీయమని సీపీఐ(ఎం) విమర్శిం చింది. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని కోరింది. మృత్యుఒడిలో చెల్లా చెదురైన మనుషుల హాహాకారాల గాజా నేలపై చేతులు చాస్తున్న వాళ్ల కోసం నైతిక మద్దతును తెలుపుతూ ‘నవ తెలంగాణ’ తన అక్షరహస్తాన్ని అందిస్తోంది.

Spread the love