కాంగ్రెస్‌ జాబితాపై గెహ్లాట్‌ ముద్ర

Gehlot stamp on Congress list– రాజస్థాన్‌ ఎన్నికల్లో సీఎం కీలక పాత్ర
– అంతా అతనిదే పైచేయి
జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటానికి రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీలు తమ వంతు ప్రయత్నాలను కొనసాగి స్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవటానికి పాట్లు పడుతున్నాయి. అయితే, అభ్యర్థుల ఎంపికే అన్ని పార్టీలకు తలకు మించిన భారంగా మారింది. టికెట్లు దక్కినవారు సంతోషంతో ఉండగా.. నిరాకరణకు గురైన నాయకులు రెబల్‌గా పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
టికెట్ల జాబితాను ప్రకటించటంలో అధికార కాంగ్రెస్‌.. ప్రతిపక్ష బీజేపీ కంటే ముందున్నది. గతనెల 31న నాలుగో, ఐదో జాబితాలను కాంగ్రెస్‌ విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా 61 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో అనుభవజ్ఞులైనవారు, యువ నాయకులు ముఖాలు ఉన్నాయి. అయితే, ఈ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు, అశోక్‌ గెహ్లాట్‌ తనదైన పాత్రను పోషించారని కాంగ్రెస్‌ వర్గాలు తెలుపుతున్నాయి.
ఈ జాబితాల ప్రకారం రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల సంఖ్య 151కి చేరుకున్నది. ఇప్పటివరకు బీజేపీ 124 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇప్పటివరకు ప్రకటించిన పేర్లలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తన మద్దతుదారులలో ఎక్కువమందికి టిక్కెట్లు ఇచ్చారని విశ్లేషకులు తెలిపారు. మూడు సార్లు సీఎంగా ఆయనకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్టానం ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. సచిన్‌ పైలట్‌, పార్టీలోని ఇతర వర్గాలు ఉన్నప్పటికీ.. అశోక్‌ గెహ్లాట్‌ అభ్యర్థుల జాబితా విషయంలో కీలక పాత్ర పోషంచారని తెలిపారు. తన విధేయులకు టికెట్లు కేటాయించటంతో పాటు ఇద్దరు సిట్టింగ్‌లను సైతం తొలగించారని చెప్పారు. ఈ ఇద్దరు.. గత ఐదేండ్ల గెహ్లాట్‌ పాలన అవినీతిమయమంటూ లేఖలు రాసిన భరత్‌ సింగ్‌, భాను ప్రతాప్‌ సింగ్‌లు కావటం గమనార్హం.
ఇక తొలగించబడిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సచిన్‌ పైలట్‌ శిబిరం నుంచే అయినప్పటికీ.. అతని మద్దతుదారులలో కూడా చాలా మంది టిక్కెట్లు పొందగలిగారు. వీరిలో కీలకం మాజీ అసెంబ్లీ స్పీకర్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే దీపేంద్ర సింగ్‌ షెకావత్‌(శ్రీమధోపూర్‌ స్థానం) కావటం గమనించాల్సిన అంశం.
2020లో పైలట్‌ నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో మనేసర్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలలో షెకావత్‌ కూడా ఉన్నారు. ఆరోగ్య కారణాలను ఉటంకిస్తూ.. షెకావత్‌ తన కుమారుడికి టిక్కెట్‌ ఇవ్వాలని కోరుకున్నారు. అయితే పార్టీ మాత్రం విశ్వాసం ఉంచి అనుభవజ్ఞుడైన షెకావత్‌కే టికెట్‌ కేటాయించింది.
పార్టీ తన మునుపటి జాబితాలలో ఇప్పటికే డజనుకు పైగా వృద్ధ నాయకులను నామినేట్‌ చేసింది. కొత్త జాబితాలో అమీన్‌ ఖాన్‌(84), దీప్‌చంద్‌ ఖైరియా (82), మహదేవ్‌ సింగ్‌ ఖండేలా(80) వంటి వృద్ధ వర్గం నుంచి మరో 10 మంది ఉన్నారు. వీరిలో సైతం ఎక్కువ మంది గెహ్లాట్‌ తరానికి చెందినవారు, ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలకు ప్రసిద్ధి చెందనవారు కావటం గమనార్హం. రాజస్థాన్‌లోని దాదాపు 49 లక్షల మంది కొత్త ఓటర్లను ఈ వృద్ధులలో ఎంతమంది ఆకట్టుకుంటారనేది ఇప్పుడు కీలకం. యువకుల ఓట్లే కాంగ్రెస్‌, బీజేపీల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్‌ అసెంబ్లీకి ఈనెల 25న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3 న ఫలితాలు వెల్లడి కానున్నాయి

Spread the love