జియోట్యాగింగ్‌తో ‘చేనేత’ కు తీవ్ర నష్టం

జియోట్యాగింగ్‌తో 'చేనేత' కు తీవ్ర నష్టం– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిలిచిన సంక్షేమ పథకాలు
– రూ.222 కోట్ల బతుకమ్మ చీరల బిల్లుల పెండింగ్‌
– సీఎం దృష్టికి తీసుకెళ్తాం : చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్‌
నవతెలంగాణ-శాయంపేట
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేనేత మగ్గాలకు జియోట్యాగింగ్‌ చేసి చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా చేసి తీవ్ర నష్టం చేసిందని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్‌ అన్నారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సొసైటీని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమవారం సందర్శించి కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత సొసైటీలో రాట్నం చుడుతున్న మహిళా కార్మికులతో మాట్లాడారు. మగ్గం నేస్తున్న కార్మికులతో మాట్లాడి రోజు కూలి ఎంత వస్తుందని, సంక్షేమ పథకాలు అందుతున్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు. చేతినిండా పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పొద్దంతా కష్టపడినా కూలీ గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సొసైటీలో 20 లక్షల వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని, టెస్కో కొనుగోలు చేయకపోవడం, బకాయి బిల్లులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సొసైటీ చైర్మెన్‌ మామిడి శంకర్‌ లింగం తెలిపారు. అనంతరం మాజీ చైర్మెన్‌, మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాపోలు వీరమోహన్‌ మాట్లాడారు. మూడేండ్ల క్రితం చేనేత ఐక్యవేదిక స్థాపించి చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పర్యటిస్తూ చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల మగ్గాలు మాత్రమే పనిచేస్తున్నట్టు జియో ట్యాగింగ్‌ ద్వారా అధికారులు చెప్తున్నారని, కార్మికులకు త్రిప్టు ఫండ్‌, నేతన్న బీమా పథకాలను అందించకుండా చేనేతపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత సొసైటీ ఎన్నికలు నిర్వహించకుండా సొసైటీలను నిర్వీర్యం చేసిందని, 2013లో ఎన్నికలు జరగగా ఆరేండ్లుగా ఇన్‌చార్జి పాలనతో సొసైటీ కొనసాగుతున్నట్టు తెలిపారు. బతుకమ్మ చీరలకు రూ.372 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండగా, కేవలం రూ.150 కోట్లు నిధులు విడుదల చేసి రూ.222 కోట్లు పెండింగ్‌లో ఉంచారని అన్నారు. సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని, నేతన్న భరోసా పథకాన్ని అందించాలని, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, కూలి రేట్లు పెంచాలని.. పలు సమస్యలపై చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి మెమోరాండం అందజేయనున్నట్టు తెలిపారు. అనంతరం సొసైటీ పాలకవర్గ సభ్యులు చేనేత ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులను చేనేత వస్త్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో కార్యనిర్వాక అధ్యక్షులు కోమటిపల్లి సదానందం, సీనియర్‌ ఉపాధ్యక్షులు రాపోలు వెంకటేశ్వర్లు, క్రమశిక్షణ సంఘం చైర్మెన్‌ కొంగరి నారాయణ, రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు చిందం సునీత, మహిళా కార్యదర్శి బీమానాదుల శారద, మీడియా కార్యదర్శి రావిరాల శ్రీనివాస్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కుడికాల భాస్కర్‌, సొసైటీ చైర్మెన్‌ మామిడి శంకర్‌ లింగం, డైరెక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love