ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట గీత కార్మికుల ధర్నా

Gita workers' dharna in front of Khammam Collectorate–  కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలి : కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట గీత కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. ఖమ్మం జిల్లాలో వేలాది కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి కాళ్లు, చేతులు విరుగుతున్నాయని, నడుములు పడిపోయి మంచాన పడిపోతున్నారని, పదుల సంఖ్యలో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకుదెరువు కోసం వృత్తి ప్రమాదమైనప్పటికీ చేస్తున్నామని, ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదని, గీత కార్మికులను ప్రమాదాల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వీరికి ప్రమాద నివారణా చర్యలు తీసుకోవాలని, సేఫ్టీ మోకును ఇవ్వాలని, 2023-24 బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.30 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కులస్తులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన లిక్కర్‌ షాపు టెండర్లలో సొసైటీలకు రిజర్వేషన్‌ కల్పించకుండా పాత పద్ధతినే కొనసాగించారని ఆరోపించారు. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా యథావిధిగా కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా అమలు చేయాలని కోరారు. ఇటీవల బీసీ కులవృత్తిదారులకు ఇచ్చిన జీవో నెంబర్‌ 5 ప్రకారం కల్లుగీత వృత్తి చేస్తున్న వారందరికీ రూ.లక్ష నగదు ఆర్థిక సహకారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. సొసైటీలకు భూమి ఇవ్వాలని, కల్లుకు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని, నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్‌, గాలి అంజయ్య, చేతి వృత్తిదారుల కమిటీ కన్వీనర్‌ ఎర్ర శ్రీకాంత్‌, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, నాయకులు నాగేశ్వరరావు, కొండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love