– హస్తాన్ని వీడిన నేతలకు కాంగ్రెస్ పిలుపు
– పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఫోకస్
– ఆసక్తి చూపుతున్న నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలిగి సొంత పార్టీని వీడారు. అటువంటి నేతలకు పార్టీ అధిష్టానం బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లోపార్టీ టిక్కెట్ దక్కలేదనో, తన కంటే జూనియర్ నాయకుడికి టిక్కెట్ ఇచ్చారనో, పార్టీకి సంబంధం లేని వారిని పిలిచి బీఫామ్ అందజేశారనో, పార్టీ తమను గుర్తించలేదనో, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే మోసం చేశారనో…ఇలా రకరకాల కారణాలతో కొందరు హస్తాన్ని వీడి…కారెక్కిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలు కావడంతో వారు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీకి దూరమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో తమతో కలిసి పని చేసిన మిత్రులతోనూ ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉండి కూడా కష్టనష్టాలకొర్చి పార్టీ జెండా మోశారు. ఈనేపథ్యంలో క్షణికావేశంలో పార్టీని వీడిన ఆ నేతలంతా ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్న విషయం పార్టీ పెద్దల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. అందుకే టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలోనే పార్టీని వీడిన సీనియర్ నాయకుల అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. హస్తాన్ని వీడిన నేతలు ఎలాంటి షరతులు పెట్టకుండా పార్టీపై, ప్రభుత్వంపై నమ్మకంతో తిరిగి సొంత గూటికి చేరాలని కోరాలని, వారిని చేర్చుకోవాలని పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. ఆమేరకు ‘ఆవేదనతో పార్టీని వీడారు…ఇప్పుడు పార్టీపై నమ్మకంతో తిరిగి రావాలి’ అని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. అటువంటి నేతల్లో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్థన్‌రెడ్డి, పార్టీ నేతలు నగేష్ ముదిరాజ్, మానవతారారు, చెరుకు సుధాకర్, నందికంటి శ్రీధర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఇందిరాశోభన్, ఎర్రశేఖర్, పి. విష్ణువర్ధన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, సోహెల్, విజరుకుమార్, కత్తి కార్తీక, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, విజరు చౌహాన్‌తోపాటు ఆయా జిల్లాల నుంచి కూడా అనేకులు పార్టీని వీడారు. అయితే రానున్న పార్లమెంటు ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి… తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా అన్ని వర్గాలను భాగస్వాములను చేసేలా వ్యూహరచన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగా పార్టీని వీడిన నేతలు తిరిగొస్తే ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుందనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తున్నది. పార్టీని వీడిన వారు కూడా అత్యధిక మంది కారు దిగి…చేయిందుకునేందుకు ప్రయత్నిస్తు న్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
పార్టీని వీడిన నేతలే కాకుండా చాలా మంది కొత్త నాయకులు, వ్యాపార వేత్తలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా వీవీసీ గ్రూప్ అధినేత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు కూడా ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమవుతున్నది. విద్యావేత్త, ప్రొఫెసర్ విద్యా స్రవంతి కూడా కాంగ్రెస్‌లోచేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కాంగ్రెస్ చాపకింద నీరులా పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయా నియోజక వర్గాలకు మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించడం తోపాటు శుక్రవారం ఇంద్రవెల్లిల్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసభ ఇంద్రవెల్లి సభ నిర్వహించడం…ఆ తర్వాత వారానికి ఐదు రోజులు ప్రజల్లో ఉంటానంటూ ప్రకటించడం ఎన్నికల కోసమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.