ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌, ఎయిర్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమిరేట్స్‌ విమానం ఈకే-524లో దుబారు నుంచి మహిళా ప్రయాణికురాలు హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారుజామున 02:57 గంటలకు చేరుకుంది. అనుమానం వచ్చిన కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు ఆమెను అడ్డుకుని తనిఖీ చేశారు. ఆమె తన లో దుస్తుల్లో బంగారం పేస్ట్‌, రెండు చిన్న గొలుసులతో కూడిన ప్యాకెట్‌ను దాచిపెట్టినట్టు గుర్తించారు. ఆమె వద్ద రూ.45,37,500 విలువ చేసే 726 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరో ప్రయాణికుని నుంచి
127 గ్రాముల బంగారం స్వాధీనం
శనివారం దుబారు నుంచి ఒక వ్యక్తి 6ఈ-1484 విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అనుమానంతో అతన్ని కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు అడ్డుకొని తనిఖీ చేశారు. అతని వద్ద గోధుమరంగు పౌడర్‌తో కూడిన ప్లాస్టిక్‌ బాక్స్‌తో పాటు పిల్లల పాల డ్రింక్‌ మిక్స్‌ కనిపించింది. దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు అతన్ని ప్రశ్నించారు. బ్రౌన్‌ పౌడర్‌లో బంగారం పౌడర్‌ ఉన్నట్టు తేలింది. వెంటనే అధికారులు పౌడర్‌ నుంచి బంగారాన్ని వేరు వేశారు. మొత్తం 127 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.7,77,621 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Spread the love