నది ఒడ్డునున్న పాఠశాలలో హరి ఎనిమిదో తరగతి చదువుకొంటున్న హాస్టల్ విద్యార్థి. జంతు దయ కలవాడు. ఒకరోజు ఉదయం నది ఒడ్డున స్నానానికి వెళ్తున్నప్పుడు గాయపడ్డ తాబేలును చూసి జాలిపడి దానికి వైద్యం చేసి బాగా కోలుకునేలా చేసాడు. ఆ తరువాత హరికి, తాబేలుకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒక సారి జమీందారు జగపతి బాబు నదిలో స్నానం చేస్తుండగా చేతి వేలుకున్న ఉంగరం నదిలో పడిపోయింది
‘అయ్యో అది మా నాన్న ప్రేమతో ఇచ్చిన ఉంగరం’ అంటూ బాధపడసాగాడు. అక్కడే ఉన్న హరి జరిగినదంతా చూసి తాబేలును పిలిచి ”తాబేలు మిత్రమా ఆ ఉంగరం వెతికి తీసుకొనిరా” అంటూ అడిగాడు. తాబేలు నది అడుగుకు వెళ్లి జగపతి బాబు ఉంగరం వెతికి తీసుకొని వచ్చి హరికి ఇచ్చింది. ఆ ఉంగరాన్ని జగపతిబాబు చేతికిచ్చాడు.
”ఈ ఉంగరానికి విలువకట్టలేను. దొరకదనుకొన్న ఉంగరాన్ని తెప్పించిన నీకు ఒక బహుమతి యిస్తున్నాను” అంటూ జగపతిబాబు బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతి చూసి హరి ఆశ్చర్య పోయాడు.
మూడు రోజులు గడిచింది. ఆ రోజు ఉదయం హరి నది దగ్గరున్న తాబేలును చూసి ”తాబేలు మిత్రమా ఆ రోజు జమీందారు ఇచ్చిన బహుమతి నీకు చూపించకుండా వెళ్ళాను ”అంటూ జమీందారు ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆన్ చేసి తాబేలు ముందు ఉంచాడు .అనుకోకుండా హరి చేతిలోనుండి జారి నదిలో పడింది.
”తాబేలు మిత్రమా నా స్మార్ట్ ఫోన్ నీటిలో మునిగిపోయింది. అది వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్ నీటిలో పడినా ఏమీ కాదు వెంటనే తీసుకునిరా” అన్నాడు హరి.
”నీవు నాకు మంచి మిత్రుడివి అయినందువలన ఆ సెల్‌ఫోన్ నేను తెచ్చివ్వదలచుకోలేదు. ఈ మూడు రోజులు నీవు నిదురపోకుండా సెల్‌ఫోన్ చూశావని నీ ఎర్రబడ్డ కళ్ళు చూస్తుంటే తెలుస్తోంది. ఆ సెల్‌ఫోన్ వలన మూడు రోజులు స్నానం చేయడానికి కూడా సమయం దొరకలేదు. ఈ రోజు స్నానానికి వచ్చావు. సెల్‌ఫోన్ పిల్లలకు చాలా హానికరమని నాకు బాగా తెలుసు. నీ బాగు కోసం నేను తెచ్చివ్వదలచుకోలేదు. నా నిర్ణయం మంచిదనిపించి నన్ను పిలిస్తే ఎప్పటిలా మంచి స్నేహితులలాగా వుందాం” అంటూ నదిలోకి వెళ్ళిపోయింది తాబేలు.
– ఓట్ర ప్రకాష్ రావు, 09787446026



