నవతెలంగాణ – హైదరాబాద్ : ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ శుభవార్త చెప్పింది. ఆధార్‌లో తమ ఈమెయిల్ చిరునామాను మార్చుకోవడానికి ఇకపై ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలలో వేచి చూడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల సౌకర్యార్థం, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ తమ స్మార్ట్‌ఫోన్‌లోని అధికారిక ఆధార్ యాప్ ద్వారానే ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకునే కొత్త వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఆధార్ కార్డులోని జనాభా సంబంధిత వివరాలు (డెమోగ్రాఫిక్ డేటా) మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇది సమయంతో కూడుకున్న పని కావడంతో ఉద్యోగులు, సుదూర ప్రాంతాల్లో నివసించే వారికి ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, డిజిటల్ సేవలను ప్రోత్సహించడంలో భాగంగా యూఐడీఏఐ ఈ కొత్త యాప్ ఆధారిత సేవను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదారులు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా తమ వివరాలను మార్చుకునేందుకు వీలు కలుగుతుంది.
ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?
వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్‌ను ఓపెన్ చేసి, “ఆధార్ వివరాల అప్‌డేట్” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. యాప్‌లో కనిపించే సూచనలను అనుసరిస్తూ, కొత్త ఈమెయిల్ చిరునామాను జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, అప్‌డేట్ కోసం అభ్యర్థనను డిజిటల్‌గా సమర్పించవచ్చు.



