నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండల కేంద్రంలో విద్యార్థుల కోసం ప్రభుత్వ వసతి గృహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్ జిల్లా కలెక్టర్‌ను సోమవారం కోరారు. గతంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బృందం అధికారులను కలిసి విన్నవించగా సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. ఇందుకు ఎస్ఎఫ్ఐ బృందం కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్, రామన్నపేట మండలాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం చౌటుప్పల్‌కు వస్తున్నారని తెలిపారు.
సుదూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యాలు లేక తరగతులకు సకాలంలో హాజరు కాలేకపోతున్నారని, ప్రస్తుతం ఇక్కడ 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో అత్యధికులు నిరుపేద, వెనుకబడిన తరగతులకు చెందినవారేనని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టల్ లేకపోవడంతో ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్తోమత లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రభుత్వ వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కలెక్టర్, ఆర్డీవోలకు ఇచ్చిన వినతి పత్రాలు, ఆందోళనల వార్తా క్లిప్పింగ్‌లను జతపరిచినట్లు దాసరి ప్రకాష్ తెలిపారు.



