విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ జోక్యం అనవసరం

Government intervention in the university is unnecessary– నిధులిచ్చి.. సమస్యలు పరిష్కరిస్తే మంచి ఫలితాలు
– విషాదంగా ముగిసిన గత దశాబ్దం : ప్రొఫెసర్‌ హరగోపాల్‌
– వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగినవని, వీటిలో రాజకీయ, ప్రభుత్వ జోక్యం అనవసరమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ప్రభుత్వాలు వర్సిటీలకు నిధులు కేటాయించి, అక్కడి సమస్యలను పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. దేశానికి వ్యవసాయం చాలా కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పదేండ్లలో ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. గత దశాబ్దం పూర్తిగా విషాదంగా ముగిసిందని, రాబోయే కాలంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషీ అవసరమని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారి అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ఒక కమిషన్‌, హైదరాబాద్‌ చుట్టూ ఉన్న భూముల పరిరక్షణకు ఒక కమిషన్‌ను వేయాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల్లో అధిక శాతం సన్న, చిన్నకారు రైతులేనని, వారి అభ్యున్నతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయానిదే కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బోధన, బోధనేతర సిబ్బంది, జర్నలిస్టులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.రఘురామిరెడ్డి, ప్రజాగాయకులు గద్దర్‌ కూతురు వెన్నెల, డాక్టర్‌ వనమాల, వాసుదేవరెడ్డి, విద్యాసాగర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love