అనురాగ్ యూనివర్సిటీ డైరెక్టర్
మహీపతి శ్రీనివాస్
బాలోత్సవం ఆధ్వర్యంలో
ప్రభుత్వ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రభుత్వ బడిలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుతారని, అందుకే ప్రభుత్వ బడి విజ్ఞానపు ఒడి లాంటిదని అనురాగ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ప్రతి సబ్జెక్టులో నిష్ణాతులుగా ఉండటానికి కారణం అక్కడ ఉండే ఉపాధ్యాయులు రకరకాల టెస్టులు రాసి, ట్రైనింగ్ చేసి, మంచి ర్యాంకులు సాధించిన వారు మాత్రమే ఉంటారని తెలిపారు. కనుక అలాంటి ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో మంచి జ్ఞానాన్ని పొందగలుగుతారని అన్నారు. నేడు ప్రయివేటు వ్యవస్థలో పోటీ పడుతున్న పరిస్థితుల్లో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రులు చాలా గొప్పవారని తెలిపారు. బతుకు తెరువు కోసం శ్రమిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొనే పేద, మధ్యతరగతి వర్గాలే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారని అన్నారు. అలాంటి పిల్లలే ప్రభుత్వ ఉద్యోగులుగా, శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, నీతి నిజాయితీ కలిగిన అధికారులుగా సమాజ సేవకు పాటుపడతారని తెలిపారు. భవిష్యత్ తరాలకు, దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత ప్రభుత్వ బడిలో చదువుకున్న వారిపైనే ఎక్కువ ఉంటుందన్నారు. దాన్ని గుర్తించి మీ భవిష్యత్‌ను మీరు తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులను కోరారు. తెలంగాణ బాలోత్సవం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్. సోమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలోత్సవాలు జరుపుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను వెలికితీయడానికి వివిధ అంశాలపై కథలు, కవితలు, వ్యాసాలు వంటి అనేక రచనలు, పోటీలు నిర్వహించడం, మట్టి బొమ్మలు, చిత్రలేఖనం, ఏకపాత్రాభినయాలు, షార్ట్ ఫిలిమ్స్, డాన్స్, సైన్స్ టిప్స్, వంటి అనేక ప్రయోగాలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు, వచ్చే ఆగస్టు నెలలో 7, 8, 9 తరగతుల్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వారందరికీ ఇలాంటి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విశ్వ మానవ సంక్షేమ సంఘం సంస్థాపక అధ్యక్షులు మస్తాన్‌రావు పెసల మాట్లాడుతూ.. బాలోత్సవంతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత ట్యూషన్స్ సెంటర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడున్న వ్యవస్థలో అనేక లొసుగులు ఉన్నాయన్నారు. అవినీతి, కులం, మతం, భాష, ప్రాంతం, లింగం వంటి అనేక వివక్షలతో కూడుకున్న దుష్ట రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు, నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. ఇలాంటి వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత నేటి విద్యార్థుల పైనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యక్షులు జి.అంకమ్మ అధ్యక్షత వహించగా సహయ కార్యదర్శి మమత, పద్మ, రూపా రుక్మిణి, ఆఫీస్ సెక్రటరీ పి.బ్రాహ్మణి, నాయకులు పి.నవీన్, మహేష్ దుర్గే తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడి విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



