Monday, July 13, 2026
E-PAPER
Homeజాతీయంమీరెవరు?

మీరెవరు?

- Advertisement -

కొత్త ఓటర్లకు మరో పరీక్ష‍
తల్లిదండ్రుల సర్‌ వివరాలు కోరుతున్న ఈసీ ఆన్‌లైన్‌ పోర్టల్
నిబంధనలు మార్చకుండానే ఫారం-6లో కొత్త షరతులు
కేంద్ర అధికారిక నోటిఫికేషన్‌ లేకుండానే మార్పులు
రాష్ట్రాలను బట్టి ఫారాల్లో మార్పులు చేస్తున్నారని సందేహాలు
పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాజీ ఎన్నికల అధికారులు

న్యూఢిల్లీ : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారి కోసం ఉపయోగించే ఫారం-6లో ఎన్నికల సంఘం (ఈసీ) కొర్రీ పెట్టింది. ఎలాంటి చట్టపరమైన సవరణలు లేకుండా, నిబంధనలను మార్చకుండా కొత్త డిక్లరేషన్‌‌ను చేర్చింది. ఆ ఫారంలో దరఖాస్తుదారుడితో పాటు వారి తల్లిదండ్రుల పేర్లు, 2002 ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నాయా లేదా అనే వివరాలు భర్తీ చేయాలని కోరుతున్నది. అయితే ఈ మార్పునకు అవసరమైన చట్టబద్ధ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ ఆంగ్ల దినపత్రిక ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఫారం -6 ను 18 ఏండ్లు పూర్తి చేసుకున్న వారు, భారత పౌరసత్వం పొందిన వారు, గతంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడినవారు మళ్లీ నమోదు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే కొత్త ఓటర్లను ఆదిలోనే కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఆ దరఖాస్తులో కొత్త సమాచారాన్ని కోరుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం తన ‘ఈసీఐనెట్‌’ ఆన్‌‌లైన్‌ ‌పోర్టల్‌‌లో పారం-6 నింపే సమయంలో ‘జె’, ‘కె’ విభాగాల మధ్య కొత్త డిక్లరేషన్‌ ‌భాగాన్ని చేర్చారు. ఇందులో దరఖాస్తుదారుడు.. 1.నా పేరు గత సర్‌ ఓటర్ల జాబితాలో ఉంది, 2. నా తండ్రి, తల్లి, తాత, అమ్మమ్మ పేరు గత సర్‌ ‌జాబితాలో ఉంది. 3. నా పేరు గానీ, నా తల్లిదండ్రుల పేరు గాన్‌ ‌గత సర్‌‌లో లేదు అంటూ ఈ మూడు ఎంపికల్లో ఒకదానిని తప్పనిసరిగా ఎంచుకోవాల్సి వస్తోంది. మొదటి రెండు ఎంపికల్లో ఏదైనా ఎంచుకుంటే.. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను కూడా నమోదు చేయాలని పోర్టల్ కోరుతోంది. అయితే, ఈ వివరాలు లేకపోతే మూడో ఎంపికను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. కానీ అలా ఎంపిక చేస్తే తర్వాత ఏమవుతుందనే విషయంపై పోర్టల్ ఎలాంటి వివరణ లేదు.

ఆన్‌లైన్ ఫారం-6లో ఈ కొత్త డిక్లరేషన్ కనిపిస్తున్నప్పటికీ… అదే పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ప్రింటెడ్‌ ఫారం-6లో మాత్రం ఈ కొత్త భాగం లేకపోవడం గమనార్హం. ఈ కొత్త నిబంధన బీహార్, అసోం మినహా సర్‌ పూర్తయిన, ప్రస్తుతం కొనసాగుతున్న ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కనిపిస్తున్నది. ఈ మార్పులు సర్‌ ప్రక్రియతో అనుసంధానమై ఉన్నాయి. గతేడాది నుంచి దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) జరిగిన సర్‌‌లో 5.58 కోట్ల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్క పశ్చిమ బెంగాల్‌లో 27 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో వారి పిల్లల ఓటరు నమోదుపై కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్-28 ప్రకారం ఓటరు నమోదు నిబంధనల్లో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వమే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈసీతో సంప్రదించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ మార్పులను ప్రకటించాల్సి ఉంటుంది. ఫారం-6 కూడా ఎన్నికల నమోదు నిబంధనలు, 1960 (రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టర్స్‌ ‌రూల్స్‌) కింద ఉన్న చట్టబద్ధ ఫారం.

అందువల్ల అందులో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని ఎన్నికల సంఘం మాజీ అధికారులు చెబుతున్నారు. ‘‘చట్టంలో, నిబంధనల్లో సవరణ లేకుండా ఎన్నికల సంఘం స్వయంగా ఫారం-6లో మార్పులు చేయడానికి అధికారం లేదు. ఫారంలో ఎక్కడైనా ఒక కామా (,) కూడా ఈసీ తనంతట తాను జోడించలేదు’’ అని ఇద్దరు మాజీ సీనియర్ ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దీనికి ఉదాహరణగా 2021లో ఆధార్ సంఖ్యను ఓటరు నమోదులో చేర్చేందుకు పార్లమెంట్ చట్ట సవరణ చేసిన తర్వాత, 2022 జూన్‌లో కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఫారం-6లో మార్పులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.అయితే ప్రస్తుత మార్పులపై ఎన్నికల సంఘం నుంచి స్పందన రావాల్సి ఉంది. దీనిపై స్పందించేందుకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అందుబాటులోకి రాలేదు. ఈ పరిణామం నేపథ్యంలో చట్టబద్ధ సవరణలు లేకుండానే ఆన్‌లైన్ ఫారం-6లో కొత్త వివరాలు కోరడం రాజ్యాంగం, పరిపాలనా పరంగా సమంజసమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -