అనుకూలమైతే ఓకే…కాదంటే అంతే..!
అర్ధరాత్రి వరకు బుకింగ్ కోసం యాతన
కనిపించని వ్యవసాయ అధికారులు
క్షేత్రస్థాయిలో రైతుల ఆవేదన
ఖరీఫ్ సాగు కీలక దశకు చేరుకున్న వేళ యూరియా కోసం రైతుల ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. రైతులకు సులభంగా ఎరువులు అందిస్తామని ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బుకింగ్ విధానం క్షేత్రస్థాయిలో తిప్పలు పెడుతోంది. యాప్‌లో సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలు, డీలర్ల ఆధిపత్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దుకాణాల్లో యూరియా నిల్వలు కనిపిస్తున్నప్పటికీ యాప్‌లో స్టాక్ లేదని చూపిస్తోంది.. సర్వర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొందరు డీలర్లు తమకు అనుకూలమైన వారి పేర్లతో బుకింగ్‌లు పూర్తిచేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. రైతు దుకాణానికి చేరుకునే సమయానికి “బుకింగ్‌లు పూర్తయ్యాయి” అనే సమాధానం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
డీలర్ అనుకుంటే బుకింగ్ జరుగుతోందని, లేదంటే స్టాక్ ఉన్నా అందడం లేదని రైతులు తెలిపారు. దీంతో బుకింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులు అర్ధరాత్రి వరకు మేల్కొని బుకింగ్‌లు చేసుకోవాల్సిన పరిస్థితికి ముగింపు పలకాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. మండలాల వారీగా స్టాక్ వివరాలను వ్యవసాయ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, వాట్సప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తే దుకాణాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుందని అంటున్నారు.
అందుబాటులో ఉండని వ్యవసాయ అధికారులు
యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచి చూస్తున్నా వ్యవసాయ అధికారులు కనిపించడం లేదు. యాప్‌లో సమస్యలు వచ్చినప్పుడు రైతులకు సహాయం చేయడం, డీలర్ల వద్ద స్టాక్‌ను పరిశీలించడం, అక్రమాలను అరికట్టడం వంటి అంశాల్లో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.
మీసేవా ప్రత్యామ్నాయం సరిపోదు
మీసేవా కేంద్రాల ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అది కూడా అందుబాటులో లేదు. సాంకేతిక ఇబ్బందులు తొలగించి, యాప్‌ను సరళీకృతం చేయడంతో పాటు అవసరమైతే ఆధార్ ఆధారిత ప్రత్యక్ష పంపిణీ విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
బుకింగ్ విధానాన్ని సులభతరం చేయాలి
రైతు ఓర్సు పురుషోత్తం
పంట కోసం ఎరువు కొనాలా.. లేక యాప్ కోసం రాత్రంతా మేల్కొనాలా? డీలర్ అనుకుంటేనే బస్తా దొరుకుతున్నది. ప్రభుత్వం రైతుల ఇబ్బందులు గుర్తించి బుకింగ్ విధానాన్ని సులభతరం చేయాలి.
సాయంత్రం 5 గంటల వరకే బుకింగ్‌లు
డీలర్ వద్ద ఉన్న యూరియా నిల్వ వివరాలను ప్రతిరోజూ ప్రకటించాలి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు సహాయం చేయాలి. డీలర్ల అక్రమాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. సర్వర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.అవసరమైతే ఆధార్ ఆధారిత పాత పంపిణీ విధానాన్ని పునరు ద్ధరించాలి. సిలివేరు శేఖర్ , ఔరవాణి గ్రామం
నల్లగొండ జిల్లాకు
41 వేల టన్నుల యూరియా
జిల్లాలో సెప్టెంబర్ నెల వరకు సుమారు 85 వేల టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే 41 వేల టన్నుల యూరియా జిల్లాకు చేరిందని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ వెల్లడించారు. రైతులు ఇప్పటివరకు 24 వేల టన్నుల యూరియాను యాప్ ద్వారా కొనుగోలు చేశారని, ప్రస్తుతం సుమారు 17 వేల టన్నులు అందుబాటులో ఉందని చెబుతున్నారు. అదనంగా గోదాముల్లో కూడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మిగిలిన యూరియా కూడా దశలవారీగా జిల్లాకు చేరుతుందని వినోద్ కుమార్ తెలిపారు. అయితే స్థానిక పరిస్థితులు అలా ఉండటం లేదు.
వ్యవసాయ అధికారి
డీలర్ కనుసన్నల్లోనే యూరియా బుకింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



