అద్భుత ఫలితాలిస్తున్నా ప్రోత్సాహం సున్నా
విద్యార్థుల్ని ‘బడిబాట’ పట్టించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
పర్యవేక్షకుల రిక్రూట్‌మెంట్ ఏదీ?
జనాభాలెక్కలు, మధ్యాహ్న భోజనం, యాప్ అప్‌డేట్‌లు
సహా అన్ని బాధ్యతలు పంతుళ్లకే
టైం టేబుళ్ల అమల్లో సవాలక్ష సమస్యలు
అయినా అనేక స్కూళ్లలో వందశాతం ఫలితాలు
కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన నమోదు
కొత్తూరు ప్రియకుమార్
ఎక్కడో మారుమూల ఉన్న ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్ గిరిజన జిల్లాల్లోని విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. అంటే అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ సమానంగా విద్యాబోధన చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో లాగా ‘బాగా చదివే విద్యార్థులు, చదివే విద్యార్థులు, విద్యార్థులు’ అని గ్రేడింగ్ చేసి చదువులు చెప్పలేదు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ వద్ద జ్ఞానాన్ని అందరికీ సమానంగా పంచడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. 2026 పదవ తరగతి పరీక్షల్లో 11,554 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తే, వాటిలో 4,629 పాఠశాలలు వందశాతం రిజల్ట్స్ సాధించాయి. పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు ఉన్నా, ఉపాధ్యాయుల నిరంతర కృషి, పట్టుదలకు ఈ ఫలితాలు నిదర్శనాలు. కానీ కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో తమ బ్రాంచీల్లో ఎక్కడో ఒకచోట ఒక్క విద్యార్థికి వందశాతం మార్కులు వస్తే, ఆ మొత్తం తమ సంస్థ ఘనతే అని ఘనంగా ప్రచారం చేసుకుంటూ, ఆ తర్వాతి ఏడాది స్కూలు ఫీజుల్ని రెట్టింపు చేసి వసూళ్లు చేసుకోవడం తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వరం గంలో నిస్వార్థంగా, ఎలాంటి ప్రచారార్భాటం లేకుండా అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఉపాధ్యాయులు గ్రామీణ విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తుండటం గమనార్హం. అన్ని కష్టాలు పడి వందశాతం ఫలితాలు తెచ్చినా, ఆ స్కూలుకు, ఆ ఉపాధ్యాయులకు ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు ఉండదు. ఎక్కడా ప్రచారమూ ప్రోత్సాహమూ ఉండదు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వచ్చే ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ప్రకటనలను చూసి వాటిలో తమ పిల్లల్ని చేర్చకపోతే భవిష్యత్ కోల్పోతారేమో అనే అనుమానంతో స్థోమతకు మించి ఫీజులు కట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లల్ని చదివించడం నామోషీగా భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు చివరకు దీన్నో సామాజిక సమస్యగా మార్చేశాయి.
కొరవడిన ప్రభుత్వ ‘పర్యవేక్షణ’
పాలకుల చిత్తశుద్ధి లేమితో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి అంటే 2014-15 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 2024-25 నాటికి ఆ సంఖ్య 24 లక్షలకు తగ్గిపోయింది. అదే కాలంలో ప్రయివేటు బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య 28 లక్షల నుంచి 36 లక్షలకు ఎగబాకింది. ఒక వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో, బలోపేతం చేయడంలో ‘పర్యవేక్షణ’ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి కీలకమైన పర్యవేక్షక పోస్టులను దశాబ్దాల తరబడి నింపకుండా పాలకులు తాత్సారం చేశారు. 2005 తర్వాత మండల విద్యాధికారి (ఎంఈఓ), 2008 తర్వాత డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీని పూర్తిగా చేపట్టలేదు. పైపెచ్చు ఆయా పోస్టుల్లో విద్యావేత్తల ద్వారా కాకుండా ఐఏఎస్ లు పాలించే ధోరణిని పెంచి పోషించారు. ఎస్ ఈఆర్టీ, సైకాలజీ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు చేయాల్సిన పనిని ఇతరులకు అప్పగించడంతో అది ప్రభుత్వ విద్యారంగంపై దుష్ప్రభావాన్ని చూపించింది. పాఠశాలలో కీలకమైన ఉపాధ్యాయ నియామకాల విషయంలోనూ తగిన శ్రద్ధ చూపించలేదు. ఒకసారి డీయస్సీ చేపట్టి అయిందనిపించారు.
అరకొర బడ్జెట్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా అధికారం చేపట్టే నాటికి చివరి బడ్జెట్ లో విద్యారంగానికి 14.67 శాతం కేటాయించారు. ఆయన అధికారం కోల్పోయే నాటికి చివరి బడ్జెట్ లో అది 6.37 శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం 8.2 శాతం కేటాయించింది. ఇలా పాఠశాల విద్య పరిధిని క్రమేణా తగ్గిస్తూ వచ్చారు. 2024-25 నాటికి రాష్ట్రంలో 62,42,276 మంది 10వ తరగతిలోపు చదివే విద్యార్థులుండగా వారిలో 36,93,618 మంది ప్రయివేటు అన్ ఎయిడెడ్, 64,335 మంది ప్రయివేట్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్నారు. అంటే మొత్తం 37,57,953 మంది ప్రయివేటులో ఉన్నారు. మిగిలిన 24,84,323 మంది ప్రభుత్వ బడుల్లో అంటే గురుకులాలు, కేజీబీవీలు, మోడల్స్ స్కూల్స్, ప్రభుత్వ స్థానిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఉన్నారు.
కరోనా టైంలో సర్కారీ స్కూళ్లే…
కరోనా మహమ్మారి తర్వాత ప్రయివేటు, కార్పొరేట్ దోపిడీని తట్టుకోలేక మధ్యతరగతి వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో నమోదు చేయించారు. దాన్ని అవకాశంగా మార్చుకుని మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ది కనబరచలేదు. ప్రభుత్వ బడిలో టీచర్ల కొరత, సౌకర్యాల లేమి వంటి సమస్యల్ని సృష్టించి, విద్యార్థులను వారి తల్లిదండ్రులకు బలవంతంగా సర్కారీ స్కూళ్ల నుంచి తీసుకెళ్లే అనివార్య పరిస్థితిని సృష్టించారు. దీనిపై విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు పదే పదే చేస్తున్న సూచనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి.
ప్రచారం లేదు
ప్రభుత్వ బడులు సాధిస్తున్న విజయాలు, విద్యార్థుల్లో పెరుగుతున్న ప్రతిభా పాటవాలు, వారు సాధిస్తున్న నూతన ఆవిష్కరణలకు ప్రచారం కరువైంది. ప్రభుత్వ బడిలో అందుతున్న నాణ్యమైన విద్యపై ప్రచారం లేకపోవడంతో, ప్రయవేటు, కార్పొరేట్ స్కూళ్లు దాన్ని అందిపుచ్చుకుని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాయి. అదే టైంలో పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లకు సర్వేలు, యాప్ ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం లెక్కలు వంటి అనేక బోధనేతర పనులను అప్పగించడం వంటి చర్యలు గవర్నమెంట్ స్కూల్స్ ను మరింత దెబ్బతీశాయి.
ప్రీ ప్రైమరీ
ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ దశల వారీగా అన్ని పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అయితే నర్సరీ స్థాయి నుంచి కాకుండా ఎల్ కేజీ నుంచి చేర్చుకోవడం, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లోనే వాటిని ప్రారంభించడం కూడా ఆశించిన మేరకు ఫలితాలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఒక వైపు ప్రయివేటు బడుల్లో నర్సరీ నుంచి జాయిన్ చేసుకుంటుంటే ప్రభుత్వ బడిలో ఎల్ కేజీ నుంచి మొదలు పెట్టడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ బడిలో 10వ తరగతిపై అధికారులు పెడుతున్న శ్రద్ధను మిగిలిన అన్ని తరగతులపై ఉంచాలని కోరుతున్నారు.
తప్పుడు ప్రచారం
ప్రభుత్వ బడుల పట్ల జరుగుతున్న ఉద్దేశ్యపూర్వక తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో సర్కారీ యంత్రాంగం విఫలమవుతోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన నిధుల లెక్క చూస్తే ఏడాదికి ఒక్కో విద్యార్థిపై రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న నాయకులు వేదికలపై మాట్లాడేటప్పుడు ప్రభుత్వ విద్యకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితాలు రావడం లేదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. అదే సమయంలో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి కరోనా తర్వాత ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థులందరిలో పఠనాసక్తి, అభ్యాసనా శక్తి తగ్గిపోయిందని నివేదిక ఇచ్చింది. దీన్ని కొందరు నాయకులు, కార్పొరేట్ అనుకూలురు ఈ పరిస్థితి కేవలం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లోనే ఉన్నట్టు చిత్రీకరించారు. ఇది కచ్చితంగా కుట్రపూరిత దుష్రచారమేనని ఉపాధ్యాయసంఘాలు ఆక్షేపించాయి. కానీ ప్రభుత్వం మాత్రం తనకేం పట్టనట్టు మౌనం వహించింది. ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుల అర్హతలు, అనుభవం రీత్యా కూడా ముందు వరసలో ఉంటుండటం గమనార్హం. అందువల్లే గిరిజన మారుమూల గ్రామాల్లోనూ వందశాతం ఫలితాలు సాధించగలుగుతున్నారు.
బ్రాండింగ్ పైనే శ్రద్ధ
పాలకులు మారినప్పుడల్లా విద్యారంగంలో తమదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పటికే ఉన్న అనేక పథకాల పేర్లు మార్చడం, కొత్తగా చిన్న మార్పులు చేసి, తమ ప్రభుత్వమే ఛాంపియన్ అని ప్రచారం చేసుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు. చివరకు ఇది పొలిటికల్ బ్రాండింగ్‌గా మారి, సర్కారీ విద్యావ్యవస్థను కుంగదీస్తుందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి హయంలో అభ్యదయ పాఠశాలలు, ఎన్టీఆర్ కాలంలో ఏకలవ్య పాఠశాలలు, తెలంగాణ వచ్చాక కేసీఆర్ గురుకులాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ఎవరిక వారు బ్రాండింగ్ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం కండ్లముందు కనిపిస్తున్న వాస్తవమే! అదే సమయంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిర్దిష్ట, శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల మానసిక స్థాయిని అంచనా వేసి, బోధనా పద్ధతులను రూపొందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.200 కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ బడిని నిర్మించడం కన్నా ఆ నిధులతో ఆయా జిల్లాల్లో అనేక పాఠశాలలను బాగు చేసే అవకాశముందని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
కేరళ మోడల్
అక్షరాస్యతలో, ప్రభుత్వ విద్యారంగంలో పాటించిన ప్రమాణాలు, కొలమానాల్లో కేరళ ఆదర్శంగా నిలిచింది. పలుసార్లు జాతీయంగా అనేక అవార్డులు అందుకుని ర్యాంకింగ్ లను సొంతం చేసుకుంది. ఇప్పటికీ అనేక రాష్ట్రాలు కేరళలో ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకున్న చర్యలపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అక్కడ విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా భౌగోళికంగా ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా టీచర్లను నియమించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఉపాధ్యాయుల నియామకమనే విధానం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణలో విద్యార్థులు లేరనే కారణంగా ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తున్నారు. 26 వేల పాఠశాలలను 4 వేలకు కుదిస్తే, అవి మరింత దూరమై విద్యార్థులు ప్రయివేటుకు డైవర్ట్ అయ్యే ప్రమాదముంది. ఇలాంటి విధానాలు మున్ముందు ప్రభుత్వ బడిని ప్రజలకు మరింత దూరం చేస్తాయి.
ప్రతి మేజర్ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ బడి :
ఎ.వెంకట్, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్రంలో ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో ఒక ప్రభుత్వ బడి ఉండాలి. 50 నుంచి 60 మంది పిల్లలున్న చోట తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల అవసరం. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 30 మంది విద్యార్థులుంటేనే ఒక ఉపాధ్యాయుడిని ఇస్తామనే షరతులు, నిబంధనల వల్ల విద్యా నాణ్యత పెరగదు. ఈ కారణంతో మారుమూల గ్రామాలు, తండాలు వంటి చోట్ల బడులు మూసేస్తే, పేద విద్యార్థులు చదువులకు దూరమవుతారు. ప్రభుత్వం ప్రభుత్వ బడుల విశిష్టతలు, విజయాలపై ప్రచారం కల్పించాలి.
- ప్రభుత్వ స్కూళ్లు – 26వేలు
విద్యార్థుల సంఖ్య – 24 లక్షలు
2026-27లో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు
– రూ.26,674 కోట్లు (8.2 శాతం)
-ఉన్నత పాఠశాలలు – 11,554 (టెన్త్ వరకు)
2026లో వందశాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ ఉన్నత
పాఠశాలలు – 4,629 (టెన్త్‌లో)



