సెమీ గురుకులాలుగా సర్కారు బడులు

Government schools as semi-gurukuls– సింగిల్‌ టీచర్‌ స్కూళ్లను మూసేయం
– ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం
– మెగా డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్‌ పోస్టుల భర్తీ
– రూ.2 వేల కోట్లతో మౌలిక వసతుల కల్పన
– త్వరలో విద్యా, వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
” దేశంలో అత్యున్నత సర్వీస్‌ విభాగాలైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర శాఖల్లో పని చేస్తున్న అధికారుల్లో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన నేను కూడా సర్కార్‌ బడి నుంచే వచ్చాం. అయితే గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి. టీచర్లు లేరనే కారణంతో పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు. పిల్లలు లేరనే సాకుతో బడులను మూసేస్తున్నారు. ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు తయారైంది. మా సర్కార్‌ సింగిల్‌ టీచర్లున్న పాఠశాలలను కూడా మూసేయకుండా నడిపిస్తున్నది. వాటిని మరింత బలోపేతం చేసి సెమీ రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దుతాం. మధ్యాహ్న భోజనంతో పాటు, ఉదయం అల్పాహారం, స్నాక్స్‌ అందిస్తాం. ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దుతాం ” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదోతరగతిలో ఈ ఏడాది 10/10 సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్‌ ప్రకటించిన ప్రతిభా పురస్కారాలను సోమవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని పేర్కొన్నారు. ప్రయివేట్‌ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించడం గర్వంగా ఉందన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడటం వాటి గౌరవాన్ని మరింత పెంచిందని కొనియాడారు. మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 20 వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటి నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామనీ, మధ్యాహ్న భోజనం నుంచి మొదలుకుని యూనిఫామ్స్‌ వరకూ అన్నింటిని వారే పర్యవేక్షిస్తారని తెలిపారు. నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా వారికి నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తల్లిదండ్రుల చెంత ఉండి చదువు కోవాల్సిన వయసులో పిల్లలను రెసిడెన్షియల్‌ సూళ్లలో చేర్పించడం వల్ల మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయనే విషయం సర్వేల్లో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. విద్యకు కేటాయించే నిధులను తమ ప్రభుత్వం ఖర్చుగా కాకుండా, సమాజానికి పెట్టే పెట్టుబడిగా భావిస్తోందని తెలిపారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్‌ లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవనీ, ఎవరూ సలహాలిచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. పదిలోనే కాకుండా ఇంటర్మీడియట్‌లోనూ స్టేట్‌ ర్యాంకులు సాధించి భవిష్యత్‌లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ ఏడాది 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, వందేమాతరం ఫౌండేషన్‌ అధ్యక్షులు రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love