– అగమ్యగోచరంగా ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల జీవితాలు
– రాజకీయ నాయకుల చేతుల్లో విద్యావ్యవస్థ బంధీ
– 15 మంది చేతుల్లోనే మెజార్టీ ఇంజినీరింగ్ కాలేజీలు
– టీఎస్‌టీసీఈఏ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో నిబంధనల మేరకు వేతనాలు అకౌంట్లలో వేసి తిరిగి లెక్చరర్ల నుంచి యాజమాన్యాలు వెనక్కి తీసుకుంటున్నాయనీ, ఈ విషయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నదని పలువురు వక్తలు ఆరోపించారు. ఫలితంగా పీహెచ్‌డీ చేసినోళ్లు కూడా రూ.20 వేలకు, రూ.30 వేలకు పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. తెలంగాణలో విద్యావ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో బంధీ అయిందనీ, 15 మంది నేతల చేతుల్లోనే మెజార్టీ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని విమర్శించారు. దీన్ని పర్యవేక్షించాల్సిన పాలకులు యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించా రు. లెక్చరర్లు, టీచర్ల వేతనాల కోసం ప్రత్యేకంగా అధ్యాపకుల బోర్డు ఏర్పాటు చేసే దాకా ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ టీచర్స్, టెక్నికల్ కాలేజీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఎస్‌టీసీఈఏ) క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్టీయూ జేఏసీ చైర్మెన్ కరుణాకర్‌రెడ్డి, టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు డి.శ్రీనివాస్, బి.అనంతరామ్, ప్రయివేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, టీపీఎల్‌ఎఫ్ అధ్యక్షులు తిరుమల్, టీఎస్‌టీసీఈఏ నేతలు కె.రాజుగుప్తా, సుగుణాకర్, పీవై రమేశ్, కె.రవి, శ్యామ్‌సుందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల జీవితాలు గుమాస్తాల మాదిరిగా తయారయ్యాయని వాపోయారు. పీహెచ్‌డీలు చేసిన తాము పిల్లలకు మంచి చదువు చెప్పించలేని దుర్భరస్థితిలో బతుకుతున్నామన్నారు. ఏ కాలేజీలోనూ నిబంధనల మేరకు సిబ్బంది లేరని చెప్పారు. నిబంధనల ప్రకారం వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీతాలు వేసి తిరిగి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగభద్రత, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, గ్రూపు యాక్సిడెంట్ పాలసీని అమలు చేసేలా యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తామన్నారు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవులను చాలా కాలేజీలు ఇవ్వడం లేదనీ, ప్రెగెన్సీ అయిన లెక్చరర్లకు సెలవులు ఇవ్వకుండా ఉద్యోగం లోంచి తీసేయడం దారుణమన్నారు.