ధాన్యం సేకరణ పకడ్బందీగా ఉండాలి

– ప్రతి గింజ కొనుగోలు చేయాలి
– జిల్లా కలెక్టర్లకు సూచన
– రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం సేకరణలో పకడ్బందీగా చేపట్టాలని, రైతులకు ఎలాంటి అంతరాయలు ఏర్పాడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.అనిల్‌ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ జిల్లాలో 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 3528.920 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా ధాన్యం దిగుమతి చేసుకునేలా చూస్తామని, రైస్‌ మిల్లుల వద్ద స్థల సమస్య ఉంటే ప్రత్యామ్నాయ స్థలాల ఎంపిక చేపడుతామని కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ తిరుపతి రావు, డీసీఎస్‌ఓ మనోహర్‌ రాథోడ్‌, జిల్లా సహకార సంస్థ అధికారి ధాత్రి దేవి, జిల్లా సివిల్‌ సప్లరు డి.ఎమ్‌.శ్యామారాణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love