నవతెలంగాణ-హైదరాబాద్: ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడు డా. హోతి బస్వరాజ్ మూడు దశాబ్దాల కళా ప్రస్థానాన్ని ప్రతిబింబించే “బసవ” ఏకవ్యక్తి కళా ప్రదర్శన హైదరాబాద్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, మాదాపూర్లో ఘనంగా ప్రారంభమైంది. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ షెట్కార్ సురేష్ కుమార్ ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ షెట్కార్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, “మా న్యాల్కల్ ప్రాంతం నుంచి ఎదిగిన డా. హోతి బస్వరాజ్ ఈ రోజు రాష్ట్ర రాజధానిలోని ప్రధాన కళా వేదికలో ఇంతటి అద్భుత కళాఖండాలను ప్రదర్శించడం మాకు ఎంతో గర్వకారణం” అన్నారు. తమ ప్రాంతంలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో ఉత్తమ జోడెద్దులను ప్రోత్సహిస్తూ బస్వరాజ్ అందించే బహుమతులు ఆయనకు ఎద్దులపై ఉన్న అభిమానం, ఆప్యాయతకు నిదర్శనమని, అదే భావన ‘బసవ’ కళారూపంలో ప్రతిఫలించిందని పేర్కొన్నారు. కళ అనేది భగవంతుడు కళాకారునికి ప్రసాదించిన అపూర్వ వరమని, అలాంటి వరాన్ని డా. హోతి బస్వరాజ్ సార్థకం చేసుకుంటూ విశిష్ట కళాఖండాలను సృష్టిస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా “బసవరాజీవం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. గత ఇరవై ఐదేళ్లుగా డా. బస్వరాజ్ రూపొందించిన శిల్పాలు, చిత్రాలు, వాటి విశేషాలు, అరుదైన ఛాయాచిత్రాలతో ఈ గ్రంథాన్ని డా. ద్యావనపల్లి సత్యనారాయణ రూపొందించారు.
ప్రదర్శన క్యూరేటర్ డా. ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, డా. హోతి బస్వరాజ్ రూపొందించిన సిగ్నేచర్ ఆర్ట్స్ ప్రత్యేకతలను వివరించారు. వ్యవసాయ నాగరికతలో బసవ (ఎద్దు) ప్రాముఖ్యతను ప్రతిబింబించే కళాఖండాలు, సప్తమాతృకలు – బోనాలు, శివదూత బసవ, పుంజు విజయం, సెల్ఫీ తదితర శిల్పాలు, చిత్రాలు ఆయన ప్రత్యేక కళాశైలికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి కళాఖండం వెనుక ఒక భావన, సామాజిక సందేశం, సాంస్కృతిక నేపథ్యం దాగి ఉందని వివరించారు.
ప్రముఖ శిల్పులు, బస్వరాజ్ గురువులు ఆచార్య ఎస్.ఎం. పీరన్, ఆచార్య జి.వై. గిరి మాట్లాడుతూ, తమ శిష్యుడు ఇంత ఉన్నత స్థాయికి ఎదిగి, విశిష్ట కళాఖండాలను సృష్టించడం తమకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ అమరజ్యోతి శిల్పి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఎం.వి. రమణారెడ్డి మాట్లాడుతూ.. డా. బస్వరాజ్ నిరంతర కృషి, అంకితభావం, కళాత్మక దృక్పథమే ఆయనను నేటి ఉన్నత స్థానానికి చేర్చాయని ప్రశంసించారు.
డా. హోతి బస్వరాజ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి విచ్చేసి తమను ఆశీర్వదించిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, కళాకారులు, కళాభిమానులు, మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కళా ప్రదర్శన జూలై 30 వరకు ప్రతిరోజూ ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, మాదాపూర్‌లో కొనసాగుతుందని, ప్రవేశం అందరికీ ఉచితమని నిర్వాహకులు తెలిపారు.




