One of the best ways to
build a new habit is to identify a
current habit you already do each
day and then stack your new
behavior on top. This is called
habit stacking.μμ – James Clear
ప్రతి మనిషికి తనవైన కొన్ని అలవాట్లుంటాయి. వాటిల్లో అన్నీ మంచివే అయివుండవచ్చు లేదా కొన్ని చెడువి, కొన్ని మంచివి ఉండొచ్చు. చెడు అలవాట్లను మినహాయిస్తే మంచి అలవాట్లతోనే ప్రతివ్యక్తి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. అయితే అలవాట్లన్నీ ఏ మనిషికీ ఒకేసారి అబ్బవు. అవి మంచివైనా చెడువైనా ఒకటి ఇంకొకదాన్ని అంటగడతాయి లేదా తెచ్చిపెడతాయి. వ్యక్తి ఎవరైనా తనకు అప్పటికే ఉన్న ఒక బలమైన పాత అలవాటు తో కొత్తగా అలవరచు కోవాలనుకున్న ఇంకో మంచి అలవాటును జతచేసి పాటించడాన్ని హాబిట్ స్టాకింగ్(Habit stacking) అంటారు.
జీవితంలో విజయం సాధించడానికి హాబిట్ స్టాకింగ్ ఒక శక్తివంతమైన టెక్నిక్. అందుకనే హాబిట్ స్టాకింగ్‌ను జీవనసరళిగా మార్చుకుంటే ఎవరైనా దేన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధించవచ్చు. పాత అలవాట్లకు సంబంధించిన నరాల అనుసంధానాలు (Neural pathways) ప్రబలంగా మన మెదడులో ఏర్పడుతుంటాయి. కొత్తగా ఒక అలవాటును విడిగా ఆచరించడం కంటే, ఆ పాత అలవాటుతో కలిపి కొత్త అలవాటును ప్రారంభించడం వల్ల మెదడు కొత్త అలవాటును సులభంగా స్వీకరిస్తుంటుంది. మెదడు స్వీకరణను వైద్య శాస్త్ర పరిభాషలో న్యూరోప్లాస్టిసిటీ (Neuroplasticity) లేదా మెదడు అనుకూలత(Brain Adaptation) అని పిలుస్తారు. మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకునే, కొత్త విషయాలను స్వీకరిస్తూ అవాంతరాల నుండి కోలుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని మెదడుకు న్యూరోప్లాస్టిసిటీ ప్రసాదిస్తుంది. హాబిట్ స్టాకింగ్ ఎవరికైనా సాధ్యపడేది న్యూరోప్లాస్టిసిటీ మూలాన్నే.
‘హ్యాబిట్ స్టాకింగ్’ అనే పదాన్ని మొదటగా ఉత్పాదకతా కోవిదుడు, వ్యక్తిగత అభివద్ధి నిపుణుడు, రచయిత ఎస్.జె.స్కాట్. తను 2014లో రాసిన Habit Stacking: 97 Small Life Changes That Take Five Minutes or Less ‘ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. హాబిట్ స్టాకింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కల్పించిన రచయిత జేమ్స్ క్లియర్. ఈయన ఆల్‌టైమ్ బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘అటామిక్ హ్యాబిట్స్ (Atomic Habits) లో అందరికీ అర్థమయ్యేలా హాబిట్ స్టాకింగ్ గురించి వివరించారు. హాబిట్ స్టాకింగ్ ప్రకారం వ్యక్తి బలవంతంగా కొత్త అలవాటుకు ప్రయత్నించకుండా, ఇప్పటికే తన దినచర్యలో భాగమైన ఒక అలవాటుకు (Anchor Habit) కొత్త అలవాటును జోడించాలి. దీని ఫార్ములాను జేమ్స్ క్లియర్ ఇట్లా.. ప్రస్తుత అలవాటును పూర్తి చేసిన తర్వాత, వెంటనే కొత్త అలవాటును ప్రారంభిస్తుండాలని, ఉదాహరణకు ఉదయం కాఫీ తాగిన తర్వాత (ప్రస్తుత అలవాటు) వెంటనే ఐదు నిమిషాలు డైరీ లేదా లక్ష్యాలు రాయడం (కొత్త అలవాటు) అనే దానిని చేయడం, రాత్రి బెడ్‌పై పడుకోవడం (ప్రస్తుత అలవాటు) కు ముందు ఏదైనా ఒక పుస్తకం చదవడం (కొత్త అలవాటు)గా సూత్రీకరించాడు. హాబిట్ స్టాకింగ్ విజయవంతం కావడానికి పాటించాల్సిన మరో మూడు సూత్రాల్ని కూడా జేమ్స్ క్లియర్ చెప్పాడు.
కొత్త అలవాటు కేవలం రెండు నుండి ఐదు నిమిషాలు మాత్రమే తీసుకునేలా జాగ్రత్త పడాలి. 2. ఏదైనా పనిని చేయాలి అని కాకుండా చేస్తాను అనే సంకల్పం ఉండాలి. ఉదాహరణకు ‘సాయంత్రం ఆ పుస్తకం చదువాలి’ అని కాకుండా, ‘రాత్రి భోజనం చేసిన వెంటనే, పుస్తకంలో ఒకటి రెండు పేజీలు చదువుతాను’ అని కచ్చితంగా అనుకోవాలి, ఆచరిం చాలి. 3. పనుల్లో సరైన మ్యాచింగ్ ఉండాలి. అంటే, ఉదయం చేసే పని పక్కన ఉదయపు కొత్త అలవాటు ఉండాలి. రాత్రి పనితో ముడిపెట్ట కూడదు. అంటే, ఏ అలవాటు వెంట కార్య రూపం దాల్చల్సిన కొత్త అలవాటు దాని తదుపరి జరగాలి. ముందర ప్రస్తావించినట్టు వ్యక్తిగత ఎదుగుదలలో హ్యాబిట్ స్టాకింగ్ ఒక శక్తివంతమైన సాధనం. జీవితంలోని వివిధ రంగాలలో ఎవరెవరు ఎట్లా దీనిని ఎలా ప్రాక్టీస్ చేయవచ్చునో ఇక్కడ ఐదు విభాగాలుగా ఉదాహరించాను.
1. శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్ (Physical Health & Fitness):సుమన్ అనే అతను ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగుతాడు. ఇక్కడ పెందలకడ నిద్రలేవడం పాత అలవాటు, గోరువెచ్చని గ్లాసు నీళ్లు తాగడం కొత్త అలవాటు. మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసిన తర్వాత, పది నిమిషాల పాటు సుమన్ నడుస్తాడు. లంచ్ పాత అలవాటు, నడక కొత్త అలవాటు. డిన్నర్ అనంతరం సుమన్ రాత్రి బ్రష్ చేసుకుని ఐదు నిమిషాల పాటు వ్యాయామం (Stretching) చేస్తాడు .డిన్నర్ పాత అలవాటు, బ్రష్ చేసుకోవడం, వ్యాయామం కొత్త అలవాటు.
2. మానసిక ఆరోగ్యం, ప్రశాంతత (Mental Health & Mindfulness): జ్యోత్స్నఉదయాన్నే కాఫీ తాగుతూ ఫోన్ పక్కనపెట్టి ప్రశాంతంగా వరండాలో కూర్చుని ప్రకతిని ఆస్వాదిస్తుంది. కాఫీతాగడం పాత అలవాటు, ఫోన్ పక్కనపెట్టి నేచర్‌ను అబ్జర్వ్ చేయడం కొత్త అలవాటు. జ్యోత్స్న ఆఫీస్‌లో డెస్క్ దగ్గర కూర్చున్న వెంటనే ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకుని దీర్ఘ శ్వాస (Deep Breathing) తీసుకుంటుంది. సీట్లో కూర్చోవడం పాత అలవాటు, దీర్ఘ శ్వాస తీసుకోవడం కొత్త అలవాటు. రాత్రి పడుకోవడానికి బెడ్‌పైకి వెళ్లిన తర్వాత జ్యోత్స్న ఆ రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయానికి సహోద్యోగులకు కృతజ్ఞత (Gratitude) చెపుతుంది. నిద్రకు ఉపక్రమించడం పాత అలవాటు, థాంక్స్ చెప్పడం కొత్త అలవాటు.
3. కెరీర్, ఉత్పాదకత(Career & Productivity) : కుమార్ లాప్‌టాప్ ఆన్ చేసిన వెంటనే, ఆ రోజు అతను చేయాల్సిన మూడు ముఖ్యమైన పనుల లిస్ట్(To-Do List) రాసుకుంటాడు. లాప్ టాప్ ఆన్ చేయడం పాత అలవాటు, ఇంపార్టెంట్ వర్క్స్ నోట్ చేసుకోవడం కొత్త అలవాటు. కుమార్ సాయంత్రం ఆఫీస్ పని ముగించే (Log off) ముందు, తన డెస్క్, కంప్యూటర్ డెస్క్‌టాప్‌ను క్లీన్ చేస్తాడు. లాగ్ ఆఫ్ పాత అలవాటు, సిస్టమ్ క్లీనింగ్ కొత్త అలవాటు. కుమార్ లంచ్ బ్రేక్ నుండి తిరిగి సీట్లోకి రాగానే, తన ఇమెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటాడు. బ్రేక్ నుంచి సీట్లోకి రావడం పాత అలవాటు, ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం కొత్త అలవాటు.
4. జ్ఞానం, నైపుణ్యాలు (Knowledge & Skill Development) : సురేష్ ప్రతిరోజూ కార్ డ్రైవ్ చేయడం లేదా బస్సు ఎక్కడం ప్రారంభించగానే, ఏదైనా ఒక ఉపయోగపడే పాడ్‌కాస్ట్ (Podcast) లేదా ఆడియో బుక్ ఆన్ చేస్తాడు. డ్రెవ్ చేయడం, బస్సెక్కడం పాత అలవాటు. పాడ్ కాస్ట్ ఆన్ చేయడం కొత్త అలవాటు. సురేశ్ రాత్రి డిన్నర్ ప్లేట్స్ శుభ్రంచేశాక, తన కోర్సు లేదా ప్రాజెక్టుకు సంబంధించిన బుక్స్ రిఫర్ చేస్తాడు. పాత్రల క్లీనింగ్ పాత అలవాటు, బుక్ రీడింగ్ కొత్త అలవాటు. సురేష్ ఉదయం న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక కొత్త పదాల్ని (New Words) నేర్చుకుంటాడు. పేపర్ రీడింగ్ పాత అలవాటు, లాంగ్వేజ్ ఇంప్రూవ్ మెంట్ కొత్త అలవాటు.
5. ఆర్థిక క్రమశిక్షణ(Financial Habits) : మాధవ్ ప్రతి నెలా జీతం అకౌంట్‌లో పడిన వెంటనే, మొదట 10% డబ్బును తన సేవింగ్స్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. సాలరీ చూసుకోవడం పాత అలవాటు, సేవింగ్స్ కొత్త అలవాటు. మాధవ్ ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనేందుకు (Add to Cart) కొట్టిన తర్వాత, కనీసం 24 గంటల పాటు వేచి ఉంటాడు. ఆన్లైన్లో ఆర్డర్ పాత అలవాటు, మరొకటి కొనడానికీ సమయం తీసుకోవడం కొత్త అలవాటు. జేమ్స్ క్లియర్ అన్నట్టు కొత్త అలవాటును నిర్మించుకోవడానికి ఉత్తమమైన మార్గం, మనం ప్రతిరోజూ ఇప్పటికే చేస్తున్న అలవాటును గుర్తించి, దానిపై మనం కొత్త ప్రవర్తనను జోడించడమే. మన తెలుగు సంప్రదాయంలో హాబిట్ స్టాకింగ్‌ను నియమ పాలన, సదాచారం అంటారు. ఆచరించిన వాళ్ళకు ఆచరించినంత ఫలితం.
– డా.బెల్లి యాదయ్య, 9848392690


