నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన భీకర తుఫాను, భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 74 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పిడుగుపాట్లు, గోడలు కూలడం, చెట్లు విరిగిపడటమే ఈ మరణాలకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో అత్యధికంగా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 17 మంది మరణించగా, భదోహిలో 16 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని జిల్లాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. గంటకు 80 నుంచి 100 కి.మీ వేగంతో వీచిన గాలులకు వేలాది చెట్లు నేలకూలాయి, దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ ఘోర విపత్తుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని సూచించారు. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొని శిథిలాలను తొలగిస్తున్నాయి.



